రెండు క్రేజీ సినిమాలు ఒకేసారి బాక్సాఫీసు దగ్గర తలపడితే - చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది. సినీ అభిమానులకు ఆ రోజు పండగే. బాక్సాఫీసు దగ్గర ఇలాంటి పోటీ చాలాసార్లు చూశారు. భవిష్యత్తులోనూ చూస్తారుకూడా. ఇప్పుడు ఓటీటీలోనూ ఇలాంటి ఫైట్లు మొదలుకానున్నాయి. థియేటర్ల వైభవాన్ని ఓటీటీలు క్రమంగా హస్తగతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో.. ఓటీటీలోనూ క్రేజీ సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో భాగంగా.. `టక్ జగదీష్` ఓటీటీకి వెళ్లిపోయింది.
అమేజాన్ ప్రైమ్ ఈ సినిమాని ఏకంగా 37 కోట్లకు కొనుగోలు చేసింది. సెప్టెంబరు 10న ఈ సినిమాని అమేజాన్ లో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా అదే రోజు నితిన్ సినిమా కూడా ఓటీటీలోనే రాబోతోంది. నితిన్ కథానాయకుడిగా నటించిన చిత్రం `మాస్ట్రో`. తమన్నా కీలక పాత్రధారి. ఈ సినిమాని డిస్నీ హాట్ స్టార్ రూ.32 కోట్లకు కొనుగోలు చేసింది.
ఈ సినిమాని కూడా సెప్టెంబరు 10నే విడుదల చేస్తార్ట. అంటే ఒకే రోజు.. రెండు సినిమాలు అన్నమాట. వేర్వేరు ఓటీటీల్లో... ఒకే రోజున, వేర్వేరు హీరోల సినిమాలు విడుదల అవ్వడం కామనే. కాకపోతే.. ఇద్దరూ పేరున్న హీరోలే కావడం. రెండు సినిమాలపై అంచనాలు ఉండడం. రెండూ థియేటర్లు లేక.. ఓటీటీలకు వెళ్లిపోవడం యాధృచ్ఛికంగా జరిగిన విషయాలు. మరి ఈ రెండు సినిమాల్లో పై చేయి దేనిదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.
ALSO READ: 'క్రేజీ అంకుల్స్' మూవీ రివ్యూ & రేటింగ్!