48 ఏళ్ల వయసులో. బండ్లగణేష్ హీరో. అది కూడా హిందీలో అభిషేక్ బచ్చన్ చేస్తున్న పాత్ర.. వినడానికి కామెడీగా ఉంది కదా..? కానీ ఇది కామెడీ కాదు. సీరియస్సే. ఔను.. బండ్ల గణేష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఓ తమిళ రీమేక్ తో. తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం `ఒత్త సెరుప్పు అళపు 7`. పార్తీబన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, అవార్డుల్నీ అందుకుంది. అందుకే మిగిలిన భాషల్లో ఈ సినిమాని రీమేక్ చేయాలని ఉత్సాహపడుతున్నారు.
హిందీలో ఈ సినిమా హక్కుల్ని అభిషేక్ బచ్చన్ సొంతం చేసుకున్నాడు. తను హీరోగా నటిస్తూ, ఈ సినిమాని నిర్మించబోతున్నాడని టాక్. ఇప్పుడు ఇదే సినిమాని తెలుగులో బండ్ల గణేష్ హీరోగా రూపొందించబోతున్నారు. వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాలో బండ్ల గణేష్ గెటప్ వైవిధ్యంగా ఉండబోతోందట. కమిడియన్ గా ఇండ్రస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తరవాత నిర్మాతగా మారాడు బండ్ల గణేష్. ఈమధ్య ట్వీట్లూ, ఆడియో ఫంక్షన్లలో స్పీచులతో పాపులర్ అయ్యాడు గానీ, ఇది వరకు పెద్దగా బ్రేక్ రాలేదు. అలాంటిది ఇన్నాళ్లకు, అదీ 48 ఏళ్ల వయసులో హీరోగా అంటే.. విచిత్రమే మరి.
ALSO READ: నాని - నితిన్ ల ఓటీటీ ఫైట్