చిరు - పవన్ ల మెగా బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్న కోసం తమ్ముడు.. తమ్ముడి కోసం అన్న అంతే. ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చిందని, ఇద్దరూ ఎడ మొహం పెడ మొహంగా ఉన్నారని.. బయట జనాలు గాసిప్‌లు వదులుతున్నా.. ఇద్దరి మధ్య అనుబంధం, కావల్సిన సమయంలో.. తేటతెల్లం అవుతూనే ఉంది. తాజాగా చిరు - పవన్‌లు మరోసారి కలుసుకున్నారు. అదీ.. సినిమా సెట్లో.
చిరంజీవి కొత్త సినిమా `లూసీఫర్` రీమేక్ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అక్కడే `భీమ్లా నాయక్` షూటింగ్ కూడా సాగుతుంది. బ్రేక్ మధ్యలో.. చిరంజీవి `భీమ్లా నాయక్` సెట్ కి వెళ్లారు. అక్కడ దాదాపు 2 గంటల పాటు గడిపారు. ఈ సందర్భంగా `భీమ్లా నాయక్` టీజర్ గురించి చిరు - పవన్ లమధ్య ఆసక్తికరమైన చర్చ సాగిందని తెలుస్తోంది. టీజర్ తనకు బాగా నచ్చిందని, పవన్ ని తాను అలానే చూడాలనుకుంటున్నానని చెప్పినట్టు సమాచారం. అంతేకాదు.. ఆగస్టు 22న చిరు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ రోజు పవన్ ని తన ఇంటికి అహ్వానించారట చిరు. ఆ రోజు సతీసమేతంగా చిరు ఇంటికి పవన్ వెళ్లబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల చిరుకి జగన్ నుంచి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఆ విషయాలూ చర్చకు వచ్చాయని సమాచారం అందుతోంది. మొత్తానికి 2 గంటల పాటు.. భీమ్లా నాయక్ సెట్లో ఆచార్య హడావుడి చేసి వచ్చేశారు. ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
ALSO READ: నయనతార సినిమాలో అనుష్క?