ఈమధ్య పెద్ద హీరోల సినిమాల్లో హీరోయిన్లు అస్సలు దొరకడం లేదు. వాళ్ల కోసం ఎదురు చూసీ, ఎదురు చూసీ, సినిమాల్ని ఆలస్యం చేయడం కంటే, దొరికిన వాళ్లతో సర్దుకుపోవడం నయం అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందుకే చూసిన కాంబినేషన్ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నాయి. తాజాగా.. అల్లు అర్జున్ - పూజా హెగ్డే కాంబో మరోసారి తెరపై సందడి చేయడానికి సిద్ధమైంది.
డీజే (దువ్వాడ జగన్నాథం) లో అల్లు అర్జున్ సరసన నటించింది పూజా హెగ్డే. ఆ తరవాత అల వైకుంఠపురంలో జోడీ కట్టారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ జంట కనువిందు చేయబోతోందని సమాచారం. అల్లు అర్జున్ కథానాయకుడిగా `ఐకాన్` పట్టాలెక్కబోతోంది. వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ సినిమాలో కథానాయికగా పూజాని ఎంపిక చేశారని తెలుస్తోంది. పుష్ష 1 పూర్తవ్వగానే.. ఐకాన్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోగా స్క్రిప్టు పనులు పూర్తి చేసి, నటీనటుల్ని ఫైనల్ చేసేయాలని చిత్రబృందం భావిస్తోంది. అందులో భాగంగానే పూజా హెగ్డే కాల్షీట్లని హోల్డ్ చేసినట్టు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి ఓ అధికారిక ప్రకటన రానుంది.
ALSO READ: పదకొండేళ్ల ప్రేమ.. పెళ్లి పీటలెక్కుతోంది