సంక్రాంతి తరవాత వెలవెలా పోయిన టాలీవుడ్ కల్కితో కళ కళ లాడింది. చప్పగా సాగిన టాలీవుడ్ జర్నీకి మంచి పాజిటీవ్ వైబ్రేషన్స్ ఇచ్చింది కల్కి మూవీ. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా వసూళ్ల జాతర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వెయ్యి కోట్ల వసూళ్ల దిశగా పరుగులు తీస్తున్న కల్కి ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కల్కి OTT రిలీజ్ తెలిసింది. మేకర్స్ సినిమా విడుదల ముందే 50 రోజులు పూర్తి అయ్యే వరకు ఓటీటీ స్ట్రీమింగ్ చేసేది లేదంటూ తేల్చి చెప్పినా ఇప్పుడు OTT స్ట్రీమింగ్ కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఫ్యామిలీ మొత్తం ధియేటర్ కి వెళ్లి సినిమా చూడలేని పరిస్థితి నెలకొంది. దానితో OTT స్ట్రీమింగ్ కోసం పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కల్కి ఓటీటీ లో రావటానికి చాలా సమయం పడుతుందని మేకర్స్ చెప్పటంతో నిరుత్సాహానికి గురైన వారికి లేటెస్ట్ అప్డేట్ మంచి హుషారిచ్చింది. కల్కి 8 వారాల తరవాత అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలు కల్కి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు, హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈ రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఒకే సారి కల్కి సినిమాను స్ట్రీమింగ్ చేసే విధంగా ఒప్పందాలు జరిగాయని టాక్. 8 వారాలంటే ఆగస్టు 15న కల్కి సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లోగా కల్కి ప్రభంజనం తగ్గు ముఖం పడుతుంది. వసూళ్లు తగ్గుతాయి. ఓటీటీ కి పర్ఫెక్ట్ టైం అని మేకర్స్ భావిస్తున్నారట.