ENGLISH

ర‌జ‌నీకి ఆదిలోనే హంస‌పాదు

29 December 2020-15:27 PM

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.. ఆ పేరే ఓ సంచ‌ల‌నం. త‌మిళ సినీ అభిమానుల ఆరాధ్య దైవం ర‌జ‌నీ. వెండి తెర‌పై ఆయ‌న సృష్టించిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. రాజ‌కీయాల్లోనూ ఆయ‌న అడుగుపెట్టాల‌ని, శిఖరాలు అందుకోవాల‌న్న‌ది అభిమానుల ఆశ‌. ద‌శాబ్దాలుగా ర‌జ‌నీ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం గురించి చ‌ర్చ జ‌రుగుతూనే వుంది. ర‌జ‌నీ కూడా.. వ‌స్తాను, వ‌స్తాను.. అంటూ ఊరిస్తూ వ‌చ్చాడు. ర‌జ‌నీవ‌న్నీ కాల‌క్షేప‌పు క‌బుర్లే.. ఆయ‌న‌ రాజ‌కీయాల్లోకి రాడు అని అంతా ఫిక్స‌వుతున్న త‌రుణంలో ఓ బాంబు పేల్చాడు. త‌న రాజ‌కీయ అరంగేట్రం గురించి కీల‌క‌మైన ప్ర‌క‌ట‌న చేశాడు.

 

అతి త్వ‌ర‌లో రాజ‌కీయ పార్టీ ప్ర‌క‌టించ‌బోతున్నాన‌ని అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాడు. ఆ పార్టీ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అంత‌లోనే... తొలి బ్రేక్ ప‌డింది. ర‌జ‌నీ ఇటీవ‌ల అనారోగ్యంతో.. ఆసుప‌త్రి పాలైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆరోగ్యం కాస్త కుదుట ప‌డింది. అయితే డాక్ట‌ర్లు మాత్రం ర‌జ‌నీకి విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని, ఆయ‌న ఒత్తిడికి గురి కాకూడ‌ద‌ని, అలాంటి ప‌నుల‌కు దూరంగా ఉండాల‌ని స‌ల‌హా ఇచ్చారు. రాజ‌కీయాల్లో కి దిగుతున్న ఈ త‌రుణంలో ర‌జ‌నీ యాక్టీవ్ గా ఉండ‌డం చాలా అవ‌స‌రం.

 

స‌భ‌లూ, స‌మావేశాలు, స‌మాలోచ‌న‌లు.. ఇలా చాలా చేయాలి. ఒత్తిడి అనేది రాజ‌కీయ నాయ‌కుల చుట్టూ తిరిగే వ‌స్తువు. ఇలాంటి స‌మ‌యంలో ర‌జ‌నీ రాజ‌కీయాలు చేయ‌డం.. ఇబ్బందిక‌ర‌మైన విష‌య‌మే. డాక్ట‌ర్ల మాట వింటే ఆయ‌న రాజ‌కీయాలకు దూరంగా ఉండాలి. ఈ ప‌రిస్థితిల‌లో రాజ‌కీయాల‌పై ర‌జ‌నీ పున‌రాలోచ‌న చేస్తార‌ని, మ‌రికొన్నాళ్లు ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటార‌న్న టాక్ వినిపిస్తోంది. ర‌జ‌నీ వ‌యసు 70 దాటేసింది. ఈ టైమ్ లో అస‌లు ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావ‌డ‌మే అన‌వ‌స‌ర‌మ‌న్న వాద‌నా వినిపిస్తోంది. మ‌రి ర‌జ‌నీ ఏం చేస్తాడో చూడాలి.

ALSO READ: మోనాల్ కొట్టింది సూప‌ర్ ఛాన్సు