ENGLISH

గాల్లో తేలిపోతున్న భామలు

11 April 2017-11:15 AM

విజయం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అలాగే అవార్డులు అమితానందాన్నిస్తాయి. ఆ అమితానందంలో ఇప్పుడు ఇద్దరు అందాల భామలు హాయిగా విహరిస్తున్నారు. అవును, 'పెళ్ళిచూపులు' ఫేం రీతూ వర్మ, 'శతమానంభవతి' ఫేం అనుపమ పరమేశ్వరన్‌ గాల్లో తేలిపోతున్నారు. వారి సినిమాలకు జాతీయ అవార్డులు రావడమే దానికి కారణం. రీతూ వర్మ అచ్చ తెలుగమ్మాయి. పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌ ఫ్రెండ్‌గానూ, ఇంకొన్ని సినిమాల్లో చెల్లెలి పాత్రల్లోనూ కనిపించి మెప్పించింది. ఇంకొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా వాటి ద్వారా ఆమెకు లభించిన గుర్తింపు తక్కువే. అయితే 'పెళ్ళి చూపులు' సినిమాతో ఆమె దశ తిరిగిపోయింది. తాను నటించిన సినిమాకి జాతీయ అవార్డ్‌ లభించడంతో ఆమె ఆనందానికి హద్దుల్లేవు. ఇంకో వైపున అనుపమ పరమేశ్వరన్‌ మలయాళీ ముద్దుగుమ్మ అయినా అచ్చం తెలుగమ్మాయిలానే తెలుగు తెరపై కనిపిస్తోంది. 'అఆ' లాంటి సినిమాల్లో నటించిన ఈ భామ 'శతమానంభవతి' సినిమాతో హీరోయిన్‌గా పెద్ద సక్సెస్‌ కొట్టింది. ఈ సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకే జాతీయ అవార్డు కూడా రావడంతో ఆమె ఆనందంతో ఆకాశంలో విహరిస్తోంది. అనుపమ, రీతూవర్మ ఇద్దరికీ కెరీర్‌లో తొలి బిగ్‌ సక్సెస్‌ 'శతమానంభవతి', 'పెళ్ళిచూపులు' చిత్రాల ద్వారా లభించింది. అందుకే వారిలో అంత ఆనందం. సోషల్‌ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటూ మురిసిపోతున్నారు. చిన్న సినిమాలకు లభించిన చాలా పెద్ద గౌరవం ఇది. అలాగే చిన్న హీరోయిన్లను చాలా పెద్ద హీరోయిన్లుగా మార్చేసిన సినిమాలకు దక్కిన గుర్తింపుగా భావించాలి. 

ALSO READ: మహేష్‌ ఎలా ఉంటాడు?