పాపం రోజా... ఇప్పుడు ఆమె పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అయ్యింది. నగరి నుంచి రోజా ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి అంతా ఊహించినదే. వైకాపా సిట్టింగ్ ఎం.ఎల్.ఏ లలో ఓటమి కోరల్లో ఉన్న తొలి స్థానం రోజాదే. రోజా ఓడిపోతుందన్న విషయాన్ని వైకాపా నేతలంతా నమ్మారు. ఒక్క రోజా తప్ప. అందుకే చివరి నిమిషం వరకూ గెలుపుపై ధీమాగా ఉన్నారు. 'నగరి నుంచి హ్యాట్రిక్ కొట్టబోతున్నా' అంటూ ప్రగల్భాలు పలికారు. చివరికి ఓడిపోయాగానే మొహం చాటేశారు. ఇప్పుడు రోజా పరిస్థితి ఏమిటన్నది పెద్ద ప్రశ్న.
ఇది వరకు హాయిగా జబర్దస్త్ షోలు చేసుకొనేవారు. నెలకంటూ కొంత నికర సంపాదన వచ్చేది. ఎన్నికల్లో ఓడిపోగానే బ్యాక్ టూ పెవీలియన్ అంటూ మళ్లీ జబర్దస్త్ షోకే వెళ్తుందనుకొన్నారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే జబర్దస్త్ టీమ్ ఇప్పుడు రోజాని కోరుకోవడం లేదు. రోజా ఉన్నా, లేకున్నా వాళ్ల రేటింగుల్లో తేడా ఏం ఉండదు. పైగా రోజా స్థానాన్ని ఇంద్రజ ఎప్పుడో భర్తీ చేసేశారు. రోజా కంటే.. ఇంద్రజ జబర్దస్త్ షోలో హుందాగా ప్రవర్తిస్తున్నారు. టీమ్ అందరితోనూ ఆమె కలిసిపోయారు. దానికితోడు జబర్‌దస్త్‌లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాం ప్రసాద్... వీళ్లంతా పవన్ పక్షం. పిఠాపురం వెళ్లి పవన్ కోసం ప్రచారం చేసి కూడా వచ్చారు. పవన్ పేరెత్తితేనే అగ్గిమీద గుగ్గిలం అయిపోతుంది రోజా. పైగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్.. వీళ్లంతా పిఠాపురం వెళ్లి ప్రచారం చేస్తే ''వాళ్ల ప్రభావం ఏముంటుంది.. వాళ్ల ప్రాణాలెంత.. వాళ్ల స్థాయెంత'' అన్నట్టు మాట్లాడారు రోజా. ఇవన్నీ ఎవరు మర్చిపోయినా లేకున్నా, జబర్దస్త్ టీమ్ మర్చిపోదు. అందుకే.. రోజాకు జబర్దస్త్ 'నో ఎంట్రీ' బోర్డు పెట్టేసింది. ఇప్పుడు రోజాకు ఈ ఆదాయం కూడా పోయినట్టే!