చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అన్నకు చేదోడు వాదోడుగా ఉన్న నాగబాబు, తమ్ముడు జనసేనలోనూ తన వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఆ పార్టీ కోసం చమటోడ్చారు. నర్సాపురం నుంచి నాగబాబు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. అయితే... పొత్తు ధర్మంలో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లిపోయింది. జనసేనకు ఉన్నవే 21 అసెంబ్లీ స్థానాలు. అందులో పవన్ ఒకటి, నాగబాబు మరోటి తీసేసుకొంటే అభ్యర్థులకు న్యాయం చేయలేమన్న ఉద్దేశంతో నాగబాబు వెనక్కి తగ్గారు. ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
అయితే ఈ త్యాగాలన్నీ సత్ఫలితాల్ని ఇచ్చాయి. జనసేన 100% స్ట్రయిక్ రేట్ తో విజయఢంకా మోగించింది. 2 పార్లమెంట్ స్థానాలూ కైవసం చేసుకొంది. కూటమిలో జనసేనది కీలక పాత్ర. జనసేన నుంచి కనీసం 4 ఎం.ఎల్.ఏలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్సుంది. పార్టీకోసం పనిచేసిన కొంతమందికి నామినేటెడ్ పదవులు దక్కడం కూడా ఖాయమే. అందులో నాగబాబు పేరు ముందు వరుసలో ఉంటుంది.
నాగబాబుని ఎం.ఎల్.సీగా పంపాలన్నది పవన్ ఆశ, ఆకాంక్ష. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అంత కష్టం కాదు కూడా. అయితే టీటీడీ ఛైర్మన్ గానూ నాగబాబుని చూసే అవకాశం ఉందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. జగన్ హయాంలో టీటీడీలో ఎన్నో అక్రమాలు జరిగాయి. చాలా వివాదాలు రేగాయి. వాటన్నింటినీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం కొత్త ప్రభుత్వంపై ఉంది. అందుకే అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని, వివాద రహితుడ్ని టీటీడీ ఛైర్మన్‌గా చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకవేళ నాగబాబుకు ఎం.ఎల్.సీ కేటాయించలేకపోతే, నాగబాబుకి టీటీడీ ఛైర్మన్‌పై మక్కువ ఉంటే, ఆ స్థానంలో నాగబాబుని చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.