మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రం `లూసీఫర్`. దీన్ని తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి `గాడ్ ఫాదర్` అనే టైటిల్ ఖరారు చేశారు. చిరంజీవితో పాటు మరో హీరో కూడా ఈ సినిమాలో నటిస్తారని ముందు నుంచీ అనుకుంటూనే ఉన్నారు. మాతృక లో ఫృథ్వీరాజ్ చేసిన క్యారెక్టర్ అది. ఆ పాత్ర కోసం పలువురు మెగా హీరోల పేర్లు పరిశీలించారు. కొన్ని రోజులుగా ఈ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తారనే ప్రచారం మొదలైంది. చిరు సినిమాలో సల్మాన్ ఖాన్ ఏంటి? ఇది జరిగే పనేనా? కేవలం హైప్ కోసమే ఇలాంటి గాసిప్పుల్ని వదిలారా? అనే సందేహాలు వెల్లువెత్తాయి.
అయితే.. అవన్నీ ఇప్పుడు తల్లకిందులైపోయినట్టే. ఎందుకంటే ఈ సినిమాలో నటించడానికి సల్మాన్ ఖాన్ ఒప్పుకున్నాడని టాక్. గాడ్ ఫాదర్ కోసం సల్మాన్ డేట్లు కూడా సర్దుబాటు చేసేశారని తెలుస్తోంది. చిరుకీ సల్మాన్ ఖాన్ కీ మంచి అనుబంధం ఉంది.చరణ్ - సల్మాన్ అయితే బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. సల్మాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా - చిరు ఇంటికి వచ్చి, కలిసి వెళ్తారు. సల్మాన్ ఉన్నన్ని నాళ్లూ.. చిరు ఇంటి నుంచే క్యారియర్ వెళ్తుంది. ఈ అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ పాత్రకు సల్మాన్ ఖాన్ ని ఎంపిక చేశారని, సల్మాన్ ఖాన్ కూడా ఓకే అనేశాడన్న టాక్ వినిపిస్తోంది. సత్యదేవ్, నయనతార ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సల్మాన్ ఎంట్రీ వార్త త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు.
ALSO READ: ఈవారం ముక్కోణపు పోటీ