ENGLISH

తెలుగు ప్రజల కోసం... ఒకే ఒక్క కోలీవుడ్ హీరో

10 September 2024-14:31 PM

తెలుగు రాష్ట్రాలు ఎన్నడూ లేని విధంగా ముంపుకి గురయ్యాయి. ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఒక వైపు పంట నష్టం, ఇంకో వైపు ఉండటానికి ఇల్లు కూడా లేక నిరాశ్రయులయ్యారు. సర్కార్ నిరంత రాయంగా సేవలు అందిస్తూనే ఉంది. ఇదంతా చూసి  టాలీవుడ్ కూడా మేమున్నా మంటూ ముందుకు వచ్చారు. తలా ఒక చేయి వేసి సీఎం రిలీఫ్ ఫండ్ కి సాయమందించారు. ఈ రోజు మేమిలా ఉన్నామంటే మీరే కారణం, ఏమిచ్చినా మీ ఋణం తీర్చుకోలేమని వారంతా ముందుకు వచ్చారు. హీరోలు, నిర్మాతలు, ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ ఇలా అందరు కలిసి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఒడ్డున చేర్చే ప్రయత్నం చేశారు. 


ఎక్కడ ఏ కష్టం వచ్చినా టాలీవుడ్ సాయం అందించటంలో ముందు ఉంటుంది. భాషా, ప్రాంతీయ భేదాలు చూడరు. ఆ మధ్య కేరళ రాష్ట్రం వయనాడ్ లో కొండచరియలు విరిగిపడితే మన తారలు ఆపన్న హస్తం అందించారు. ఎక్కడో జరిగింది మనకెందుకులే అని అనుకోలేదు. చిరంజీవి, మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి ఎందరో స్టార్స్ భారీ విరాళమిచ్చారు వయనాడ్ కోసం. అలాంటిది ఇప్పడు తెలుగు రాష్ట్రాలకి ఇంత పెద్ద కష్టం వస్తే మిగతా భాషల వాళ్ళు ఎవరూ ముందుకు రాలేదు. హీరోయిన్స్ కూడా ఇంత మంది ఉన్నారు. టాలీవుడ్ లో రెండు చేతులా సంపాదిస్తున్నా ఒక్కరు కూడా ఒక్క రూపాయి విరాళమివ్వలేకపోయారు. అనన్య నాగళ్ళ లాంటి చిన్న హీరోయిన్, యాంకర్ స్రవంతి లాంటి వాళ్ళు సాయం చేశారు తప్ప ఈ విషయం పై తెలుగు ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. 


టాలీవుడ్ మీడియా మిత్రులు కూడా వేరే నటులు ఫండ్ ఇస్తారేమో అని ఇన్నాళ్లు చూసారు. ఇన్నాళ్ళకి కోలీవుడ్ హీరో 'శింబు' తెలుగు రాష్ట్రాలకి 6 లక్షలు ఫండ్ ప్రకటించి మంచి మనసు చాటుకున్నాడు. అసలు శింబు సినిమాలో తెలుగులో రిలీజ్ అవటం తక్కువ. అప్పుడెప్పుడో ఒకటి రెండు సినిమాలు వచ్చాయి. అయినా శింబు ఫండ్ ఇచ్చాడు తప్ప మిగతా స్టార్ హీరోలు ఎవరూ ఆసక్తి చూపలేదు. టాలీవుడ్ లో మార్కెట్ పెంచుకుంటున్న కోలీవుడ్ హీరోలు చాలామంది ఉన్నారు. సూర్య, కార్తీ, విక్రమ్ , విశాల్, సిద్దార్థ్ లాంటి నటుల ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతోంది. వారు ఇక్కడా మార్కెట్ చేసుకుంటున్నారు. సోనూ సూద్ లాంటి మహాను భావుడు తెలుగురాష్ట్రాలకు 5 కోట్లు విరాళమిచ్చాడు.