ENGLISH

ర‌జ‌నీ జీవితాన్ని మార్చిన ఎన్టీఆర్ స‌ల‌హా!

28 May 2022-11:48 AM

ఒక ఐడియా జీవితాన్ని మార్చేసిన‌ట్టు కొన్ని కొన్ని సార్లు.. కొన్ని కొన్ని స‌ల‌హాలు... అద్భుతాలు సృష్టిస్తాయి. జీవన గ‌మ‌నాన్ని మార్చేస్తాయి. అలా.. ర‌జ‌నీకాంత్ కి ఎన్టీఆర్ ఇచ్చిన స‌ల‌హా.. బాగా ప‌ని చేసింది. ర‌జినీ జీవితంపై పెను ప్ర‌భావం చూపించింది. ఆ వివ‌రాల్లోకి వెళ్తే...

 

తమిళ చిత్రరంగ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమాల్లోకి రాకముందు బస్‌ కండెక్టర్‌గా పనిచేసేవారు. ఆయన ఎన్టీఆర్‌ అభిమాని. ‘మాయాబజార్‌’, ‘పాండవవనవాసం’ చిత్రాలు లెక్కలేనన్నిసార్లు చూశారు. మరో ముఖ్యమైన విషయం ఏమిమంటే రజనీకాంత్‌ ఆర్టిస్ట్‌ కావడానికి కారణం ఎన్టీఆరే! అదేలాగంటే ఆయన కండెక్టర్‌గా పనిచేసే రోజుల్లో ఒకసారి స్టాఫ్‌ అంతా కలసి ఒక పౌరాణిక నాటకం ప్రదర్శించారు. అందులో దుర్యోధనుడి వేషం రజనీది. ఇందుకోసం ఎన్టీఆర్‌ ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రం చూసి అందులో ఎన్టీఆర్‌ ఎలా నటించారో తను అలాగే చేయడానికి రజనీ ప్రయత్నించారు. ఆ నాటక ప్రదర్శన విజయవంతం కావడంతో సినిమాల్లో ప్రయత్నించమని అందరూ సలహా ఇచ్చారు. ఆ సలహా నచ్చి మద్రాస్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో రజనీకాంత్‌ చేరడం, శిక్షణ పూర్తయ్యాక దర్శకుడు కె.బాలచందర్‌ దృష్టిలో పడడం, ఆయన హీరోని చేయడం జరిగింది.

 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌తో కలసి ‘టైగర్‌’ అనే చిత్రంలో నటించారు రజనీకాంత్‌. ఆ సమయంలో ఆయన తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉండేవారు. అటు సినిమాలు, ఇటు తన అలవాట్లు.. రెండింటినీ బ్యాలెన్స్‌ చేయలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యేవారు రజనీకాంత్‌. దీని వల్ల మనిషి అన్‌ బ్యాలెన్స్‌ అయి, చీటికిమాటికీ ప్రతి ఒక్కరితో తగదాలకు దిగేవారు. ఎన్టీఆర్‌ ఇది గమనించి, ఒక రోజు దగ్గరకు పిలిచి ‘బ్రదర్‌.. తెల్లారి మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ కాలం అంటారు. ఆ సమయంలో నువ్వు ప్రాణాయామం చేస్తే పూర్తిగా కోలుకుంటావు.. అని సలహా ఇచ్చారు. కొంతకాలం ఆయన చెప్పినట్లే చేయడంతో రజనీకాంత్‌ మాములు మనిషి అయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ‘మేజర్‌ చంద్రకాంత్‌’ ఆడియో ఫంక్షన్‌కు అతిధిగా హాజరైన రజనీకాంత్‌ ఎన్టీఆర్‌ సమక్షంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ALSO READ: 'ఎఫ్ 3' మూవీ రివ్యూ అండ్ రేటింగ్!