ENGLISH

మార్కెట్‌ పెంచుకుంటోన్న యంగ్‌ హీరో

13 March 2017-14:33 PM

ఈ మధ్యే 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాలో రైల్వే రాజు పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ యంగ్‌ హీరో. నేచురల్‌ యాక్టింగ్‌తో అందరి దృష్టిలోనూ పడ్డాడు ఆయన ఇంకెవరో కాదు శ్రీ విష్ణు. ఇంతవరకూ ఈ హీరో చేసిన సినిమాల్లో మరో హీరో ఉండేవాడు. కానీ ఈ సారి సోలోగా తన పర్‌ఫామెన్స్‌ చూపిస్తానంటున్నాడు. 'మా అబ్బాయి' అనే కేచీ టైటిల్‌తో మన ముందుకు వస్తున్నాడు. ఈ నెల 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. అయితే శ్రీ విష్ణుకి సోలో హీరోగా నటించడం కన్నా, పాత్ర నచ్చితే, ఏ సినిమాలోనైనా నటించడం ఇష్టమే అంటున్నాడు. ఈ యంగ్‌ హీరో చేతిలో ప్రస్తుతం మూడు సినిమాల వరకూ ఉన్నాయి. 'మెంటల్‌ మదిలో', 'నీది నాది ఒకే కథ' అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ చిత్రాల చిత్రీకరణ పూర్తయినాకే కొత్త చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నానంటున్నాడు శ్రీ విష్ణు. హీరోగా మాత్రమే నటిస్తానని మడి కట్టుకుని కూర్చోనంటున్నాడు. క్యారెక్టర్‌ రోల్స్‌ కూడా చేస్తానంటున్నాడు. ఏది ఏమైనా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఆటిట్యూడ్‌ బాగుంది మనోడిది. ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు బాగా తెరకెక్కించారట. డైరెక్టర్‌ వట్టి కుమార్‌ ఈ చిత్రాన్ని లిమిటెడ్‌ బడ్జెట్‌లో అద్భుతంగా తెరకెక్కించారని శ్రీ విష్ణు అంటున్నాడు. క్యారెక్టర్‌ పరంగా నెగిటివ్‌ షేడ్స్‌ పండించడానికి కూడా తనకేమాత్రం అభ్యంతరాల్లేవంటున్నాడు మన అబ్బాయి శ్రీ విష్ణు.

ALSO READ: బాహుబ‌లి రేటు అదిరింది గురూ!