నటీనటులు : సుధీర్ బాబు, ఆనంది, సత్యం రాజేష్, రావు రమేష్ తదితరులు
దర్శకత్వం : కరుణ కుమార్
నిర్మాతలు : విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫర్ : శాందత్ సైనుద్దీన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
రేటింగ్: 2.75/5
కొత్త కథలు రావు అని దర్శకులెప్పుడో ఫిక్సయిపోయారు. ప్రేక్షకులు కూడా పాత కథలకే అలవాటు పడిపోయారు. `పాత కథైనా చెప్పండి కానీ.. నచ్చేలా తీయండి` అని ఫ్రీడమ్ ఇచ్చేశారు. ప్రేమకథలైతే.. మరీ రొటీన్ అయిపోయాయి. ధనిక - పేద మధ్య ప్రేమ కథలెన్ని చూళ్లేదు? కులం, మతం అడ్డుగోడలుగా నిలబడిన ప్రేమ కథలెన్ని రాలేదు..? దర్శకుడు కరుణ కుమార్ కూడా అలాంటి ఓ రొటీన్ కథే ఎంచుకున్నాడు. అదే.. `శ్రీదేవి సోడా సెంటర్`. ఉన్నతమైన కులంలో పుట్టిన అమ్మాయికీ, దిగువ కులంలో పుట్టిన అబ్బాయికీ నడిచిన ప్రేమకథ. మరి ఈ ప్రేమకు ఎన్ని అవాంతరాలు ఎదురయ్యాయి? వాటి నుంచి ఈ ప్రేమ జంట ఎలా తప్పించుకుంది?
* కథ
సూరిబాబు (సుధీర్ బాబు) లైటింగ్ అంటే ఊర్లో ఫేమస్. కండబలం ఉన్నోడు. డబ్బులు బాగా సంపాదించి - టౌన్ లోనూ ఓ షాప్ పెట్టాలని చూస్తుంటాడు. ఆ ఊర్లో తిరనాళ్లకని వచ్చిన శ్రీదేవి (ఆనంది)ని ప్రేమిస్తాడు. శ్రీదేవి కూడా సూరిని ఇష్టపడుతుంది. ఆ ఊర్లో పెద్ద మనిషిగా చలామణీ అయ్యే కాశీ (నవగీతన్) వల్ల.. సూరికి ఎప్పటికప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ ప్రేమకథలోనూ తనే విలన్. ఓ గొడవలో... హత్యాయత్నం కేసులో సూరి జైలుకి వెళ్తాడు. తిరిగొచ్చి శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.
శ్రీదేవికి ఇంట్లో పెళ్లి చూపులు కుదురుతాయి. పెళ్లి చూపుల రోజున... సూరి వస్తాడని, తనని తీసుకెళ్తాడని ఎదురు చూస్తుంటుంది. ఈలోగా సూరి కేసు అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. అదేమిటి? సూరి కోసం శ్రీదేవి ఎన్నాళ్లు ఎదురు చూడాల్సివచ్చింది? ఈ ప్రేమకథకు అసలు విలన్ ఎవరు? అనేది మిగిలిన కథ.
* విశ్లేషణ
అమ్మాయి - అబ్బాయి మధ్య అగాథాన్ని సృష్టించిన అంశం.. కులం. అబ్బాయిది తక్కువ కులమైతే.. అమ్మాయిది ఎక్కువ కులం. వాటి మధ్య అంతరమే... ఈ ప్రేమకు విలన్. అయితే ఇలాంటి కథలు ఇది వరకు కూడా చాలా చూశాం కాబట్టి... ఆ సంఘర్షణేం కొత్తగా అనిపించదు. ఊరి రాజకీయాలు, ఈ ప్రేమకథ చూస్తే... ఇటీవల విడుదలైన రంగస్థలం, ఉప్పెన ఛాయలు కనిపిస్తాయి. పల్లెటూర్లో పడవ పోటీలు, తీర్థం.. ఇవన్నీ మన నావెల్టీని మరోసారి గుర్తు చేస్తాయి. ప్రేమకథలో కొత్తదనం లేకపోయినా శ్రీదేవి - సూరి బాబుల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.
శ్రీదేవి క్యారెక్టర్ ని దర్శకుడు కాస్త బాగా డిజైన్ చేసుకోవడం వల్ల రొటీన్ కథ కూడా నిలబడగలిగింది. కులం అనేది ఎప్పుడైతే అడ్డుగోడగా వచ్చిందో అక్కడ కథ మరింత రసవత్తరంగా మారింది. అయితే ద్వితీయార్థం ప్రారంభమవ్వడమే సినిమా చప్పబడిపోయింది. హీరో - హీరోయిన్లు ఇద్దరూ లేచిపోవడం, బావ (హర్షవర్థన్) ఇంట్లో ఉండడం, అక్కడ ఓ పెళ్లి జరిపించడం ఇవన్నీ కాలయాపన దృశ్యాలు అనిపిస్తాయి. ఆ తరవాత.. ఈ ప్రేమ కథ మళ్లీ ఊరి బాట పడుతుంది. జైలు నుంచి తిరిగొచ్చిన సూరి... ప్రతీకారం తీర్చుకోవడంతో కథ ముగుస్తుంది.
మిగిలిన కథంతా సాదా సీదాగానే సాగిపోయింది. పాత్రలు బలంగా ఉండడం, డైలాగులు బాగా రాసుకోవడం వల్ల కొన్ని సన్నివేశాలు బాగున్నాయన్న ఫీలింగ్ తెచ్చాయి. పైగా పల్లెటూరంతా పచ్చగా కనిపిస్తుంటే - రొటీన్ కథసైతం టైమ్ పాస్ అయిపోతుంది. ఈ కథలో ఉన్న జిస్ట్ అంతా క్లైమాక్స్ లోనే. బహుశా.. తెలుగు ప్రేక్షకులకు ఈ తరహా క్లైమాక్స్ పూర్తిగా కొత్త కావొచ్చు. అయితే దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారన్న విషయంపైనే శ్రీదేవి జాతకం మొత్తం ఆధార పడి ఉంది.
క్లైమాక్స్ విషయంలో దర్శకుడు కటువుగా ఉండిపోయాడు. తాను అనుకున్నదే చూపించాడు. అది చాలామందికి నచ్చకపోవొచ్చు. కాకపోతే... పతాక సన్నివేశాల్ని గుర్తుండిపోయేలా రాసుకున్నాడు. చివర్లో ఎవరి కులం తక్కువ? అంటూ నరేష్ ని సుధీర్ బాబు నిలదీసే సన్నివేశం, భర్త... ఉరితాడు బిగించుకుంటున్నా.. భార్య.. భోజనం చేస్తున్న దృశ్యం - కచ్చితంగా ఈ కథలోని డెప్త్ ని ఆవిష్కరించేవే. చాలా సన్నివేశాలు సుదీర్ఘంగా సాగి ఇబ్బంది పెడతాయి. షార్ప్ గా కట్ చేయాల్సిన సీన్స్ సైతం... దర్శకుడు సహజత్వం కోసం సాగదీశాడు.
* నటీనటులు
మాస్ లుక్ లో సుధీర్ బాబు అదిరిపోయాడు. తన నటన తప్పకుండా నచ్చుతుంది. ఇది వరకటి సినిమాలకంటే.. సుధీర్ చాలా కొత్తగా, ఫ్రెష్ గా కనిపించాడు. సూరిబాబు పాత్రకు నూటికి నూరు పాళ్లూ న్యాయం చేశాడు. పతాక సన్నివేశాల్లో మరిన్ని ఎక్కువ మార్కులు పడతాయి. ఆనందిని పాత్ర కూడా గుర్తుండిపోతుంది. ప్రారంభ సన్నివేశాల్లో అల్లరిగా, అందంగా కనిపించింది. పెళ్లి సీన్ లో తనలోని నటి బయటకు వచ్చింది. నరేష్ మరోసారి విజృంభించాడు. తనకీ ఇది కొత్త తరహా పాత్రే. నవగీతన్ పాత్రకు రఘు కుంచె డబ్బింగ్ చెప్పడం వల్ల.. ఆ గొంతే డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. సత్యం రాజేష్ ఓ మంచి స్నేహితుడి పాత్రలో రాణించాడు.
* సాంకేతిక వర్గం
టెక్నికల్ గా ఈ సినిమా బాగుంది. పల్లెటూరి అందాల్ని బాగా చూపించారు. ముఖ్యంగా తిరునాళ్లు, పడవ పోటీలకు సంబంధించిన సీన్లు బాగా తీశారు. మణిశర్మ నేపథ్య సంగీతం మరో ప్రధాన ఆకర్షణ. మందులోడా అనే మాస్ గీతం థియేటర్లలో ఊపు తీసుకొస్తుంది. కరుణకుమార్ సాదా సీదా కథనే ఎంచుకున్నా, ఆ కథని చెప్పే క్రమంలో తన నిజాయితీ ఆవిష్కరించుకున్నాడు. సంభాషణలు బాగా రాసుకున్నాడు. పతాక సన్నివేశాలు జీర్ణించుకోవడం కష్టమే అయినా - వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది.
* ప్లస్ పాయింట్స్
సూరి - శ్రీదేవి
టెక్నికల్ టీమ్
సంభాషణలు
* మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
* ఫైనల్ వర్డిక్ట్: సోడా రుచి ఓసారి చూడొచ్చు
ALSO READ: 'శ్రీదేవి సోడా సెంటర్' ఇంగ్లిష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.