ENGLISH

సునీల్‌ విలనిజం.. ఇంకో సినిమా కోసం

03 September 2020-11:00 AM

కమెడియన్‌గా స్టార్‌ స్టేటస్‌ పొందిన సునీల్‌, ఆ తర్వాత హీరోగా మారాడు. అయితే, హీరోగా సినిమాలు చేయడం నుంచి కాస్త విరామం తీసుకుని, మళ్ళీ కమెడియన్‌గా అవతారమెత్తాడు. ఇంతలోనే నెగెటివ్‌ రోల్‌లో నటించేందుకు ఒప్పుకున్నాడు. ‘కలర్‌ ఫొటో’ సినిమాలో సునీల్‌ విలనిజం పండించనున్న విషయం విదితమే. మళ్ళీ హీరోగా ‘వేదాంతం రాఘవయ్య’ సినిమా ఓకే చేశాడు. ఇక, ఇప్పుడు తాజాగా సునీల్‌కి సంబంధించి ఇంకో ఆసక్తికరమైన గాసిప్‌ టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

 

సునీల్‌ చేతికి ఓ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ వచ్చిందనీ, అందులో సునీల్‌ విలనిజం ప్రదర్శించబోతున్నాడనీ సమాచారం. పైగా, అది ఓ మెగా బ్యానర్‌లో రూపొందనున్న సినిమా అట. హీరో ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ‘సునీల్‌ విలనిజం పండిస్తాడు.. అయితే, అది ఆయన చుట్టూ తిరిగే కథ అయి వుండొచ్చు.. ఇదొక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ సినిమా..’ అని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కమెడియన్‌గా ఎన్ని సినిమాలు చేసినా, హీరోగా సత్తా చాటినా.. సునీల్‌కి విలనిజం మీద మక్కువ ఎక్కువ.

 

సునీల్‌ని నెగెటివ్‌ రోల్‌లో చూడగలమా.? అన్న సందేహం అతన్ని అభిమానించే చాలామందిలో వుంది. కానీ, విలనిజంలో వుండే కిక్కే వేరప్పా.. అంటున్నాడు సునీల్‌. కరోనా సంక్షోభం నుంచి టాలీవుడ్‌ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది.. వరుసగా కొత్త సినిమాలకు సంబంధించి ప్రకటనలు వస్తున్నాయి. సునీల్‌ గురించి కూడా బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌డేట్స్‌ వస్తుండడం గమనార్హం.

ALSO READ: లిప్ లాక్ పేరుతో చీటింగ్ చేశారా?