ENGLISH

'పద్మావత్‌'కి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

18 January 2018-13:31 PM

అనేక వివాదాల నడుమ ఎట్టకేలకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ అందుకున్న 'పద్మావత్‌' సినిమాకి సుప్రీంకోర్టు అండదండలు కూడా లభించాయి. ఈ సినిమా విడుదలపై ఆదేశాలివ్వాలంటూ చిత్ర నిర్మాత ఇటీవల సుప్రీంకోర్టునాశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు 'పద్మావత్‌' సినిమా విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

సుప్రీంకోర్టు తీర్పుతో ఇంతవరకూ ఈ సినిమాను బ్యాన్‌ చేసిన రాష్ట్రాలు కూడా నిషేధం ఎత్తివేయాల్సి ఉంటుంది. ఇంతవరకూ రాజస్థాన్‌, గుజరాత్‌, హర్యానా తదితర ఐదు రాష్ట్రాల్లో 'పద్మావత్‌' సినిమాపై నిషేధం విధించారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఇకపై ఈ సినిమాని అధికారికంగా నిషేధించే అవకాశం ఏ రాష్ట్రానికి లేదని తేలిపోయింది. అయితే అధికారిక నిషేధానికి వీలుకానప్పుడు, అనధికారిక నిషేధాలు తెరపైకొస్తుంటాయి. ఆ కోణంలో చూస్తే 'పద్మావత్‌'కి ఇంకా గండాలు పూర్తిగా తొలగిపోలేదని చెప్పవచ్చు. 

అయినా సెన్సార్‌ బోర్డ్‌ సినిమాని క్లియర్‌ చేశాక రాష్ట్రాల అభ్యంతరాల్లో అర్థమే లేదన్నది మెజార్టీ సినీ ప్రముఖులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. హిందీతో పాటు, తెలుగులోనూ, తమిళంలోనూ కూడా ఈ సినిమా విడుదల కానుంది. జనవరి 25న సినిమాని విడుదల చేసేందుకు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్‌. అయితే అంతకన్నా ఒక్క రోజు ముందే అనగా 24న 'పద్మావత్‌' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనీ తాజా సమాచారమ్‌. 

దీపికా పదుకొనె టైటిల్‌ రోల్‌ పోషిస్తోన్న ఈ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌. షాహిద్‌ కపూర్‌ ఇతర ముఖ్య తారాగణంగా నటిస్తున్నారు. వయా కామ్‌ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రానికి సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నారు.

 

ALSO READ: మహేష్ కత్తిని టార్గెట్ చేసిన పూనం కౌర్!