ENGLISH

విశ్వంభర దిద్దుబాటు చర్యలు షురూ

17 October 2024-13:05 PM

సోషల్ మీడియా ద్వారా కొంత చెడు జరుగుతోంది. కొంత మంచి జరుగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' మూవీ టీజర్ దసరాకి రిలీజ్ చేసారు. ఈ టీజర్ కొందరికి ఆనందాన్నివ్వగా మరికొందరికి అసహనాన్ని ఇచ్చింది. కారణం విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేకపోవటం, మెగాస్టార్ లుక్ కూడా ఫాన్స్ కి నచ్చకపోవటం. ఇప్పటికే సంక్రాంతి  భరిలో నిలవాల్సిన ఈ మూవీ వాయిదా పడిందని, అనుకున్న టైంకే వాయిదా లేకుండా బాలయ్య వస్తున్నారని కానీ చిరు సమ్మర్ కి వెళ్లిపోయారని నిరుత్సాహాంగా ఉన్నారు. ఇప్పడు టీజర్ ఇంకొంచెం అసహనాన్ని పెంచింది. దీనితో సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ మొదలుపెట్టారు.   


సోషియో ఫాంటసీ నేపథ్యం లో తెరకెక్కిన 'విశ్వంభర' వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అస్సలు బాగోలేవని, చాలా నాసిరకంగా ఉన్నాయని, థియేటర్స్ లో చూస్తే అస్సలు ఆడియన్స్ కి ఎక్కువని, ప్రభాస్ ఆది పురుష్ లా అవుతుందని ఆవేదన చెందుతున్నారు. చిరు స్టైల్ కూడా ఖైదీ 150 నుంచి ఒకేలా ఉందని క్యాస్టూమ్ డిజైనర్ అయిన చిరు పెద్ద కూతురు సుష్మిత ని కూడా మార్చాలని పలు సూచనలు చేసారు మెగా ఫాన్స్. ఆడియన్స్ సలహాలను, టీజర్ పై వచ్చిన విమర్శలు, ట్రోల్స్ ని దృష్టిలో పెట్టుకుని దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారట విశ్వంభర టీమ్. 


ఎలాగూ సమ్మర్ వరకు టైం ఉండటంతో వీఎఫ్ ఎక్స్ ను రిపేర్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. చిరు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని తనకు తెలిసిన డైరక్టర్లతో చర్చలు జరిపినట్లు టాక్. ఈ క్రమంలోనే చోటా కె నాయుడుతో కూడా చిరు మాట్లాడినట్లు తెలుస్తోంది. వీఎఫ్ ఎక్స్ క్వాలిటీ కోసం పలు కంపెనీలతో చిరు, వశిష్ట చర్చలు జరుపుతున్నారట. టీజర్ నేర్పిన పాఠంతో యూవీ క్రియేషన్స్ కూడా బడ్జెట్ విషయంలో తగ్గేదేలే అని మంచి అవుట్ పుట్ ఇచ్చేలా టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తోందని సమాచారం.