ENGLISH

35 చిన్న కథ కాదు మూవీ రివ్యూ & రేటింగ్

06 September 2024-13:23 PM

చిత్రం: 35 చిన్న కథ కాదు
దర్శకత్వం: నంద కిషోర్ ఇమాని 
కథ - రచన :   నంద కిషోర్‌ ఇమాని


నటీనటులు: నివేదా థామస్‌, ప్రియదర్శి, R. విశ్వదేవ్‌ , గౌతమి, భాగ్యరాజ్‌, కృష్ణ తేజ, అభయ్‌, అనన్య, తదితరులు.


నిర్మాతలు: రానా దగ్గుబాటి, సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్ళపల్లి  


సంగీతం: వివేక్‌ సాగర్‌
సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మి రెడ్డి 
ఎడిటర్: టీ. సి . ప్రసన్న  


బ్యానర్:  సురేష్ ప్రొడక్షన్స్, న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్.  


విడుదల తేదీ: 6 సెప్టెంబర్ 24 
 

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 3/5


ఆగస్టు నెలాఖరున నాని సరిపోదా శనివారంతో సందడి చేశాడు. సెప్టెంబర్ లో ఎన్టీఆర్ దేవర రిలీజ్ ఉండటంతో పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కి నోచుకోలేదు. దీనితో ఒకటి రెండు చిన్న సినిమాలకి టైం కలిసి వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్  పానిండియా మూవీ గోట్ ఈ వారం రిలీజ్ అవుతున్నా, వెనక్కి తగ్గకుండా '35 చిన్న కథ కాదు' మూవీ రిలిజ్ కి సిద్ధం అయ్యింది. కేవలం కథ పై ఉన్న నమ్మకంతోనే ఈ మూవీ గోట్ తో ఢీ కొట్టింది. వకీల్ సాబ్ సినిమా తరవాత నివేదా థామస్ తెలుగులో నటించిన సినిమా ఇదే కావటం విశేషం. ఈ మధ్య వరుస సినిమాలతో హీరోగా అలరిస్తున్న ప్రియదర్శి ఓ కీల‌క పాత్ర‌లో నటించాడు. రానా లాంటి స్టార్ హీరో ఈ మూవీని నిర్మించటంతో మంచి బజ్ ఏర్పడింది. ప్రమోషన్స్, ట్రైలర్, అన్నీ సినిమాకి హైప్‌ తెచ్చి పెట్టాయి. నిర్మాతగా రానా హిట్ కొట్టాడో లేదో? నివేదా ఇన్నాళ్ళకి తెలుగు ఆడియన్స్ ని మెప్పించిందో లేదో ఈ రివ్యూలో  చూద్దాం.      


కథ :

ప్రసాద్ (విశ్వదేవ్) తిరుపతిలో ఆర్టీసీ కండక్టర్ గా పని చేస్తూ ఉంటాడు. వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ప్రసాద్ తన మరదలు సరస్వతి(నివేదా థామస్)ని పెళ్లి చేసుకుంటాడు. వీరికి ఇద్దరు పిల్లలు పుడతారు. వారి పేర్లు అరుణ్, వరుణ్. చిన్నవాడు వరుణ్ పరవాలేదు బుద్ధిగానే ఉంటాడు. కానీ పెద్దవాడు అరుణ్ గడసరి. ప్రతిదానికి లాజిక్ వెతుకుతుంటాడు. లాజికల్ గా కనెక్ట్ అయితేనే ఆ పని చేస్తాడు. స్కూల్లో 'జీరో' గురించి వచ్చిన డౌట్ తో మ్యాథ్స్ అంటేనే విరక్తి వస్తుంది. ఎందరు మ్యాథ్స్ టీచర్లు ప్రయత్నించినా మ్యాథ్స్ మీద ఆసక్తి పోతుంది. దీనితో అన్ని సబ్జెక్ట్స్ లో 80 శాతం మార్కులు వచ్చినా, మ్యాథ్స్ ఫెయిల్ అవుతుంటాడు. అదే స్కూల్ కి చాణక్య వర్మ (ప్రియదర్శి) మ్యాథ్స్ టీచర్ గా వస్తాడు. అరుణ్ అడిగే ప్రశ్నలకి చాణుక్య విసుక్కుంటాడు. ఫండమెంటల్స్‌ను ప్ర‌శ్నిస్తే మిగిలేది జీరోనే అంటూ అరుణ్‌కి జీరో అని పేరు పెట్టి చివ‌రి బెంచీకి పంపిస్తాడు చాణుక్య. 6TH క్లాస్ కూడా ఫెయిల్ చేస్తాడు. దీంతో త‌న త‌మ్ముడి క్లాస్‌లో కూర్చోవాల్సి వ‌స్తుంది అరుణ్. అనుకోకుండా చాణక్య ఆక్సిడెంట్ కి అరుణ్ కారణమవుతాడు. దీంతో స్కూల్లో గొడవ అవుతుంది. అరుణ్ స్కూల్లో చదవాలి అంటే అతను మ్యాథ్స్ పాస్ అవ్వాలి అనే కండిషన్ పెడతారు. అసలు మ్యాథ్స్ అంటే ఏ మాత్రం ఇంట్రస్ట్ లేని అరుణ్ మ్యాథ్స్ పాస్ అయ్యాడా? స్కూల్లో కంటిన్యూ అయ్యాడా లేదా? అరుణ్ కు లెక్కల అంటే ఎందుకు ఇష్టం ఉండదు? అరుణ్ ప్రవర్తనతో చాణుక్య ఎలా విసిగిపోయాడు? చాణక్యను అరుణ్ ఎలా ఇబ్బంది పెట్టాడు? చదువులో వెనకబడి ఉన్న కొడుకును చూసి ప్రసాద్ బాధ? కొడుకు పరిస్థితి చూసి తల్లి సరస్వతి ఏం చేసింది?  అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.   


విశ్లేషణ: 

సహజంగా చిన్నపుడు పిల్లలకి అర్థం కాని సబ్జెక్ట్ మ్యాథ్స్. మ్యాథ్స్ అంటే ఆమడ దూరం పారిపోయే పిల్లలు ఉన్నారు. చిన్నప్పుడే వారి భయాలు పోగొడితే వారు మ్యాథ్స్ లో అద్భుతాలు చేయొచ్చు. కానీ వారిని మరికొంచెం భయపెట్టి, పీడిస్తే పూర్తిగా విరక్తి వచ్చే అవకాశముంటుంది. కరక్ట్ గా ఇదే విషయాన్ని పట్టుకున్నాడు దర్శకుడు. శ్రద్ద కలిగిస్తే పిల్లలు దేన్నైనా సులభంగా నేర్చుకుంటారని సున్నితంగా చెప్పాడు. పిల్లలు ముఖ్యంగా నేటి జనరేషన్ ప్రశ్నలు ఎక్కువ వేస్తారు. వాటిని మనం తేలిగ్గా తీసి పడేయకుండా, వారికి అర్థం అయ్యే విధంగా చెప్పగలిగితే వారిలో ప్రశ్నించే తత్త్వం పెరుగుతుంది. అవగాహన కూడా పెరుగుతుంది. ప్రస్తుతమున్న ఈ పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు, టీచర్స్ పిల్లలని మిషన్స్ లా తయారు చేస్తూ, వారి పై బలవంతంగా రుద్దుతూ, వెనకబడిన పిల్లలని ఇంకొంచెం అవమానిస్తూ, విసుక్కుంటూ ప్రవరిస్తున్నారు ఇలాంటి సంఘటనల్ని మన ముందు ఉంచారు దర్శకుడు. 


స్కూల్లో టీచర్ తన బాధ్యతని విస్మరించినప్పుడు తల్లి కొడుకు భయాల్ని పోగొట్టి, విజేతగా నిలబెట్టిన తీరు అద్భుతం. ప్రతి మనిషిలో అంతర్లీనంగా తెలివితేటలు ఉంటాయని వాటిని బయటికి తీసే విధానంలోనే విజ‌యం ఉంటుంది. లెక్కలంటే భయపడే కొడుకుని 10 వ తరగతి కూడా పాస్ అవ్వ‌ని తల్లి మెరుగు పెట్టడం ఔరా అనిపిస్తుంది. డిగ్రీలు సంపాదించి స్కూల్ లో ఉద్యోగం వెలగబెడుతున్న ఒక టీచర్  వల్ల కాని పని ఒక సాధారణ గృహిణి చేసి చూపించటం పలువురి పేరెంట్స్ కి మార్గదర్శకం. టీచర్స్ కి ఆత్మ విమర్శ లా ఉంది. చదువుకోవటం అంటేనే ప్రశ్నించటం అదే ఆగిపోతే ఆ చదువు సాగదని, నిరర్ధకమనీ మంచి మెసేజ్ ఇచ్చాడు దర్శకుడు. నేటి విద్యా వ్యవస్థ తీరుని ప్రశ్నిస్తూ, అమ్మా, నాన్నల భావోద్వేగాలు, పిల్లల మానసిక అలజడి అన్నీ ఆలోచింపజేసేవిగా సాగుతాయి. ప్ర‌శ్న‌ల‌తో క‌థ‌ని మొద‌లుపెట్టి, సెకండ్ హాఫ్ లో అమ్మ పాత్రతో వాటికి స‌మాధానాల్ని చెప్పించిన విధానం ఆడియన్స్ ని ఆకట్టుకుంది. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ కథ ముందు, అవన్నీ తేలిపోయాయి. పిల్లల మానసిక సంఘర్షణ మన మనసుల్ని మెలిపెడుతుంది. కమర్షియల్ హంగులు లేని చక్కటి కథ. 


35 నిజంగానే చిన్న కథ కాదు. మన భావితరాల భవిష్యత్తుని ప్రశ్నార్థకం కాకుండా ఆలోచింప చేసే కథ. ఫస్టాఫ్ కామెడీ పంచుతూ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సరదాగా సాగిపోతుంది. నివేదా థామస్, విష్ణుదేవ్ మధ్య మిడిల్ క్లాస్ లైఫ్‌లో ఉండే భార్య భర్తల అనుబంధం,   అనూభూతులను చక్కగా తెర కెక్కించారు. సెకండాఫ్‌లో ఫ్యామిలీలో ఎమోషన్స్ ని, పిల్లల భావోద్వేగాల్ని మనసుకు హత్తుకొనేలా చిత్రించారు. 


నటీ నటులు:

నివేదా థామస్ ఇద్దరు పిల్లలు తల్లిగా అద్భుతంగా నటించింది. సినిమా మొత్తాన్ని నివేదా నడిపించింది అనటంలో సందేహం లేదు. ఒక వైపు భార్యగా, ఇంకో వైపు తల్లిగా, పిల్లాడికోసం పడే తపన అన్ని వేరియేషన్స్ సూపర్ గా చూపించింది నివేదా. మొదటిసారి తల్లి పాత్రలో నటించి పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది. భర్తతో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఒక ఎత్తు అయితే, పిల్లలతో బిహేవ్ చేసే విధానం, చాణ‌క్య టీచ‌ర్‌తో త‌న పిల్ల‌ల‌కు ఆ పేర్లు ఎందుకు పెట్టిందో చెప్పే  సందర్భం ఆమె నటనను హైలెట్ చేసాయి. చాలా చోట్ల క‌ళ్ల‌తోనే భావాల్ని ప‌లికించింది.  ట్రెడిషనల్ పాత్రలో విశ్వదేవ్ పర్వాలేదనిపించాడు. సగటు తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. మ్యాథ్స్ టీచర్ పాత్రలో ప్రియదర్శి హండ్రడ్ పర్శంట్ న్యాయం చేసాడు. పాత్రల ఎంపికతోనే దర్శకుడు సగం విజయ సాధించాడు. సీనియర్ న‌టుడు భాగ్యరాజా చాలా రోజుల తరవాత కనిపించారు. గౌతమి క్యారెక్టర్ చిన్నదే అయినా పర్వాలేదనిపించింది. చిన్న పిల్లలు అంతా  వారి వయసుకు మించి పరిణితి చూపించి మెప్పించారు. అరుణ్ క్యారెక్టర్ చేసిన పిల్లాడు అందరి మనసులు దోచుకున్నాడు.   


టెక్నికల్ :

టెక్నికల్ గా చూస్తే కథని ఎంచుకున్న విధానం, ఆ కథని తాను అనుకున్నట్టు నడిపించి, ఆడియన్స్ మనసు దోచుకోవటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. దర్శకుడు కేవలం కథ- స్క్రీన్ ప్లే విషయంలోనే కాదు డైలాగ్స్ విషయంలో కూడా కేర్ తీసుకున్నాడని, తనలో ఉన్న స్పాంటేనిటీ చాలా చోట్ల కనిపించింది. స్క్రీన్ ప్లే కూడా సాఫీగా, మలుపులు  లేకుండా సాగిపోయింది. ఆడియన్స్ కి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చక్కటి స్క్రీన్ ప్లే రాసుకున్నారు.  కథ సింపుల్ గా ఉంటూ, ఆలోచింప జేసేదిగా ఉంది. దర్శకుడు ఓ కొత్త కోణాన్ని సున్నితంగా మలచిన తీరు ప్రశంసనీయం. మాట‌లు ఆక‌ట్టుకుంటాయి. ఎన్నున్నా స‌రే, ఓడిపోతామ‌నే భయం ఉంటే ఏమీ లేకుండా చేస్తుంది, గెలుపు అనే ప్ల‌స్ వైపు అడుగులు వేస్తున్న ప్ర‌తిఒక్కరికీ ఎదుర‌య్యే ఓ మ‌జిలీ జీరో, ఎద‌గాల‌నుకున్న‌ప్పుడు తుంచాలి కొమ్మనైనా, కొడుకునైనా లాంటి పలు డైలాగ్స్ గుర్తుండి పోతాయి. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో కథని నడిపించి ఆధ్యాతిక భావాన్ని కూడా కలిగించారు దర్శకుడు. నికేత్ సినిమాటోగ్రఫి చ‌క్క‌గా ఉంది. తిరుపతిలో ఉండే  ఆధ్యాత్మికతని ప్రేక్షకుడి మైండ్ లోకి ఎక్కించేలా ఉంది కెమెరా పనితనం. వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పాటలు బాగున్నాయి.  క్లైమాక్స్‌ సీన్స్ చ‌క్క‌గా ఎలివేట్ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మంచి అభిరుచి ఉన్న నిర్మాత అనిపించుకున్నాడు రానా. ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం శ్రద్ద పెడితే బాగుండేది. సినిమా లెన్త్ ని పరిగణించాల్సింది.    


ప్లస్ పాయింట్స్ 

నటీ నటులు 
ఎమోషన్స్ 
కథ - సంభాషణలు  
 

మైనస్ పాయింట్స్ 
 
స్లో నేరేషన్ 


ఫైనల్ వర్దిక్ట్ : తెలుగు తారే జమీన్ పర్