ENGLISH

బాధితులకి అండగా తారాలోకం

04 September 2024-13:06 PM

సినీ పరిశ్రమలో నటులపై ఫాన్స్ చూపించే అభిమానానికి ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోవాలి అంటూ ఉంటారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. కానీ సమయం వచ్చినప్పుడు ఫ్యాన్ కోసం ఆపన్నహస్తం అందిస్తూ మేమున్నామంటూ భరోసా ఇస్తారు.మాకు తీసుకోవటమే కాదు ఇవ్వటం  కూడా వచ్చని నిరూపిస్తూ, అభిమానుల్లో సంతోషాన్ని రెట్టింపు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం ప్రజల్ని అతలాకుతలం చేస్తోంది. ఈ క్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ వంతుగా సాయం అందించేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. 


డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు, తెలంగాణ సీఎం ఫండ్ కి కోటి విరాళం ప్రకటించారు. అంతే కాకుండా వరద ప్రభావిత గ్రామాలు మొత్తం 400 ఉన్నాయి. ఒక్కో పంచాయతీకి లక్ష చొప్పున డైరక్ట్ గా పంచాయతీ ఖాతాకు విరాళం పంపిస్తాను అని పవన్ తెలిపారు. 400 గ్రామ పంచాయితీలకి 4 కోట్లు మొత్తం పంపిణీ చేయనున్నట్లు పవన్ తెలిపారు. 


మొదటి రోజే ఎన్టీఆర్, అశ్వనీ దత్, విశ్వక్, సిద్దు లాంటి తారలు విరాళం ప్రకటించగా ఇప్పుడు పలువురు అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి 50 లక్షల చొప్పున ప్రకటించారు. వైజయంతి మూవీస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షలు ప్రకటించారు. మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ నిమిత్తం 50 లక్షల చొప్పున ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి రెండు రాష్ట్రాలకి చెరో 50 లక్షలు అనౌన్స్ చేశారు. బాలయ్య కూడా రెండు రాష్ట్రాలకి చెరో 50 లక్షలు విరాళమిచ్చారు. 


ఆయ్ మూవీ యూనిట్ ఈ వారం వచ్చే కలెక్షన్స్ లో 25 శాతం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రభాస్ ఒక్కో రాష్ట్రానికి కోటి విరాళమిచ్చారు. బన్నీ చెరో 50 లక్షలు ఇచ్చారు. త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ కలిసి రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి 25 లక్షల చొప్పున ప్రకటించారు. సిద్ధూ జొన్నలగడ్డ రెండు రాష్ట్రాలకి 15 లక్షల చొప్పున ప్రకటించారు. విశ్వక్ సేన్ రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి 5 లక్షల చొప్పున ప్రకటించారు. డైరెక్టర్ వెంకీఅట్లూరి రెండు తెలుగు రాష్ట్రాలకి 5 లక్షల చొప్పున విరాళమిచ్చారు. అనన్య నాగళ్ళ రెండు రాష్ట్రాలకి కలిపి 5 లక్షలు ప్రకటించింది. యాంకర్ స్రవంతి రెండు రాష్ట్రాలకి చెరొక లక్ష ఇచ్చింది.