ENGLISH

రివ్యూవర్స్ పై శ్రీకాంత్ అయ్యంగార్ మితిమీరిన ఆవేశం

26 October 2024-23:20 PM

కొందరు ఎదో ఒక రకంగా ఫేమస్ అవాలనుకుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తుండటంతో ఏం చేసినా క్షణాల్లో వైరలైపోతున్నారు. అది ఎవరినైనా విమర్శిస్తే ఇంకా ఫాస్ట్ గా జనాల్లోకి వెళ్తున్నారు. అందుకే ఎదుటివారిని విమర్శించి షార్ట్ కట్ లో ఫేమ్ సంపా దించే దారిని ఎంచుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ శ్రీ కాంత్ అయ్యంగార్  కూడా ఇలాగే మీడియా మిత్రులపై, రివ్యూవర్స్ పై చిందులు తొక్కారు. 


కారణం తాను నటించిన పొట్టేల్ సినిమాకి కొందరు నెగిటీవ్ గా రివ్యూస్ ఇవ్వటమే. సినిమా తీసే వాళ్లకి, నటులకి రివ్యూ రైటర్లపై కోపం రావటం సహజమే కానీ మరీ ఇంతలా అసభ్య పదజాలం తో విరుచుకు పడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. వీళ్ళేమి సమాజ సేవ చేయటం లేదు. ఫ్రీ సర్వీస్ కాదు. ఒక రకంగా బిజినెస్ చేస్తున్నారు. దీనికి ఇంత బిల్డప్ ఎందుకు. తాము సమాజాన్ని ఉద్ధరిస్తుంటే ఎదుటి వారు పనిగట్టుకుని వారిని విమర్శిస్తున్నట్టు అపోహ ఎందుకు. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. వాక్ స్వేచ్ఛ కూడా ఉంది. ఆ స్వేచ్ఛతోనే కదా ప్రజంట్ శ్రీకాంత్ అయ్యంగార్ కూడా హద్దులు చెరిపేసారు. 


రివ్యూవర్స్ బాధ్యతే అది. తప్పు ఒప్పుల్ని ఎత్తి చూపటం. తప్పులు సరిదిద్దితేనే కదా ఇంకో సారి ఒప్పు అయ్యేది. సినిమా కోసం నటీ నటులు ఎంత కష్టపడతారో అందరికీ తెలిసిందే. కానీ ఆ సినిమా పై ఎంతో కొంత హోప్స్ పెట్టుకుని వెళ్లే ఆడియన్స్ కి కూడా నిజం చెప్పాలి కదా అన్నది రివ్యూవర్స్ వాదన. అందరి తరపున వకాల్తా పుచ్చుకున్నట్లు శ్రీకాంత్ అయ్యంగార్ సభా ముఖంగా అసహ్య ప‌ద‌జాలంతో, వినటానికి, మళ్ళీ ప్రస్తావించటానికి వీలు కానీ భాషలో  వీరంగం సృష్టించారు.    


అసలు నిజం ఏంటి అంటే చాలా మంది పొట్టేల్ కి మంచి రివ్యూలు ఇచ్చారు. శ్రీకాంత్ అయ్యం గార్ రివ్యూవర్స్ ని చీల్చి చెండాడినంత దారుణంగా పొట్టేల్ రివ్యూలు లేవు. మంచి ప్రయత్నమే, మన నేటివిటీ సినిమా అని ప్రశంసించారు. అయ్యం గార్ నటన కూడా బాగుంది అని రాసారు. నిడివి, హింస ఎక్కువ అయ్యిందని ప్రస్తావించారు అంతే. ఇదే ప్రెస్ మీట్ లో స్వయంగా ద‌ర్శ‌కుడే మాట్లాడుతూ మంచి రివ్యూలు ఇచ్చారని రివ్యూ రైట‌ర్ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కానీ శ్రీ‌కాంత్ అయ్యంగార్ మాత్రం వాటిని తుంగలో తొక్కేశారు.