ENGLISH

శ్రీ‌కాంత్ అయ్యంగార్ క్షమాపణ.....నిజమేనా?

28 October 2024-11:24 AM

శనివారం పొట్టేల్ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించగా, ఆ మీట్ లో క్యారక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ రివ్యూ రైటర్స్ పై విరుచుకుపడ్డారు. అది కూడా చెప్పనలవి కాని భాషతో విమర్శలు చేసారు. వినటానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. శ్రీ‌కాంత్ మాటలను తీవ్రంగా పరిగణించిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆయనపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు కంప్లైంట్ చేసారు. అయ్యంగార్ పై తగిన చర్యలు తీసుకోవాలని 'మా' అధ్యక్షుడు మంచు విష్ణును కోరారు.

సినిమాలకి రివ్యూలు రాయటం ఆపేయాలని కూడా అయ్యంగార్ పేర్కొన్నారు. ఆయన వాడిన భాష, మాట్లాడే తీరుని ఖండిస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిలిం క్రిటిక్స్ ఫిర్యాదు చేయటమే కాకుండా అయ్యంగార్ మీడియా మిత్రులకి, రివ్యూవర్స్ కి క్షమాపణలు చెప్పేవరకు, ఆయన నటించే సినిమాల ప్రెస్ మీట్లకి అటెండ్ కాకూడదని, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ల సంఘం నిర్ణయించింది.

దీనితో అయ్యంగార్ క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం అయ్యారు. ఒక వీడియో రిలీజ్ చేశారు.  అందులో ఇటీవ‌ల రివ్యూ రైట‌ర్ల‌పై కొన్ని మాటలు మాట్లాడాను. కొన్ని విష‌యాల్లో బాధ క‌లిగించాను. త్వ‌ర‌లో మీ అంద‌రికి క‌రక్ట్ విష‌యాల‌పై బేష‌ర‌తు క్ష‌మాప‌ణ ఇవ్వ‌బోతున్నా. ద‌య‌చేసి వేచి ఉండండి అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు.  ఇందులో 'క‌రక్ట్ విష‌యాల‌పై' అని ప్రస్తావించటంతో కొందరు ఎదో ఉద్దేశ్యం ఉంది అని డౌట్ పడుతున్నారు. అంటే మరొక విష‌యంపై కాంట్ర‌వ‌ర్సీకి అయ్యంగార్ సిద్ధం అవుతున్నారా అని సందేహాలు మొదలయ్యాయి.

క్షమాపణలు విషయంలో టాలీవుడ్ ప్రముఖులు పలువురు అయ్యంగార్ కి ఫోన్ చేసి వివ‌ర‌ణ అడిగిన‌ట్టు, సారీ చెప్పేసి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేయమని సలహా ఇచ్చినట్లు సమాచారం. కానీ అయ్యంగార్ తగ్గేదేలే అన్నట్టు వ్యవహరించారని, వాళ్ల‌తో కూడా ఇలాగే అసభ్యంగా మాట్లాడిన‌ట్టు, క్ష‌మాప‌ణ‌లు చెప్పే ప్ర‌స‌క్తే  లేద‌ని, తానూ హండ్రెడ్ పర్శంట్ అని వాదిస్తున్నారట. అయ్యంగార్ క్షమాపణకోసం ఫిల్మ్ క్రిటిక్స్ వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి.