ENGLISH

సూర్య ని చూసి నేర్చుకోవాల్సిందే

28 October 2024-11:45 AM

పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రాకముందునుంచి కోలీవుడ్ హీరోలని టాలీవుడ్ ఆడియన్స్ ఆదరిస్తూనే ఉన్నారు. ఇంచుమించుగా అన్ని తమిళ సినిమాలు తెలుగు డబ్బింగ్ తో రిలీజ్ అవుతూనే ఉంటాయి. తెలుగు హీరోలకి ఎంత క్రేజ్ ఫాలోయింగ్ ఉంటుందో, కోలీవుడ్ హీరోలకి అంతే క్రేజ్ ఉంది తెలుగులో. అయినా గానీ ప్రమోషన్స్ పై కోలీవుడ్ హీరోలు ద్రుష్టి పెట్టటం లేదు. మన తెలుగు హీరోలు ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్తున్నారు. విజయ దేవర కొండ తన సినిమాలన్నిటికీ తెలుగులో చేసినట్టుగానే తమిళనాడులో కూడా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు. దేవర సినిమాకోసం ఎన్టీఆర్, సరిపోదా శనివారం కోసం నాని కూడా తమిళనాడులో విస్తృతంగా పర్యటించారు.

కానీ కోలీవుడ్ హీరోలకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ ఉన్నా ప్రమోషన్స్ అంటే ఆసక్తి చూపటం లేదు. రజనీ కాంత్, విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోలు ఇప్పటివరకు తెలుగులో తమ సినిమాల్ని ప్రమోట్ చేసిన దాఖలాలు లేవు. లాస్ట్ కి విజయ్ తెలుగులో నటించిన 'వారసుడు' సినిమాకి కూడా ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. కానీ వీరందరికి భిన్నంగా సూర్య, కార్తీ ప్రతీసారి తెలుగులో వారి మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నారు. వీరి నుంచి ఏ సినిమా వచ్చినా ఇంటర్వ్యూలు, పబ్లిక్ ఈవెంట్‌ లుతో సందడి చేస్తుంటారు. అందుకే తెలుగు ఆడియన్స్ వీరిద్దరిని పరభాషా హీరోలుగా చూడలేదు.

తాజాగా సూర్య 'కంగువ' మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్, వైజాగ్‌ సిటీల్లో ఈవెంట్‌లు ప్లాన్ చేశాడు. అంతే కాక జోరుగా ప్రెస్ మీట్లలో కూడా పాల్గొంటున్నాడు. బిగ్ బాస్ తెలుగు షో లో గెస్ట్ గా అడుగు పెట్టి కంగువా ప్రమోషన్స్ చేసారు. హిందీ, తమిళం, తెలుగు అన్ని భాషల్లోనూ సూర్య ప్రమోషన్స్ నిర్వహిస్తూ పలువురి మనసు గెల్చుకుంటున్నారు. కోలీవుడ్ హీరోలు సూర్య, కార్తీలని ఫాలో అయితే బెటరని పలువురి సూచన. సూర్య కెరియర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి  శివ దర్శకత్వం వహించారు. ఇదొక పీరియాడిక్ జోనర్, ఇందులో సూర్య యోధుడిగా నటించారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ 14న కంగువా రిలీజ్ కానుంది.