ENGLISH

అడవి శేషు కి హీరోయిన్స్ కొరత?

21 October 2024-16:53 PM

విభిన్న కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అడవి శేషు. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, ఎంట్రీ ఇచ్చి హీరోగా కెరియర్ సాగిస్తున్నాడు. గూఢచారి, క్షణం, మేజర్, లాంటి సినిమాలతో హీరోగా నిలదొక్కుకుని మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. శేషు ప్రజంట్ గూఢచారి సినిమాకి సీక్వెల్ గా 'గూఢచారి 2' చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. మొదటి పార్ట్ లో శోభిత దూళిపాళ హీరోయిన్ గా నటించింది. ఆమె పాత్ర ఆ సినిమాలో ఎండ్ అవటంతో సీక్వెల్ లో బనితా సంధు అనే బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకున్నారు. 


శేషుకి నార్త్ లో కూడా గుర్తింపు ఉండటంతో ఇప్పటికే బాలీవుడ్ లో నటించిన హీరోయిన్ అయితే బెటరని, పాన్ ఇండియా సినిమా కాబట్టి బనితాని సెలెక్ట్ చేసారు. ఆమె కూడా శేషుతో నటించటానికి చాలా ఆతృతగా వెయిట్ చేసింది. తీరా షూటింగ్ మొదలయ్యాక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. కారణం తెలియదు. అంత ఇంట్రెస్ట్ గా శేషుతో నటించటానికి ఒప్పుకున్న బనితా సంధు ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యిందో తెలియటం లేదు. నెక్స్ట్ గూఢచారి సినిమాకి డీవోపీగా వర్క్ చేసిన షానీల్ డియో డైరెక్షన్ లో కూడా 'డకాయిట్' అని ఇంకో ప్రాజెక్ట్ కి శేషు వర్క్ చేస్తున్నాడు. ఈ మూవీలో శేషు సరసన శృతి హాసన్ ఫిక్స్ అయ్యింది. వీరిద్దరూ కలిసి నటించటం ఇదే మొదటిసారి కావటంతో వీరి జోడిపై ఆసక్తి పెరిగింది. కానీ ఇంతలోనే డకాయిట్ నుంచి శృతి కూడా తప్పుకుంది. కారణం డేట్స్ అడ్జస్ట్ అవక అని టాక్. 


అసలు కారణం వేరే ఉందని, అది బయటికి తెలియటం లేదని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇప్పడు యధావిధిగా ఈ రెండు సినిమాలకి హీరోయిన్స్ ని వెతికే పనిలో పడ్డాడు శేషు. ఇప్పటికే గూఢచారి, డకాయిట్ షూటింగ్స్ మొదలై కీలక పార్ట్ కంప్లీట్ చేసారని, హీరోయిన్స్ లేకుండా ఉన్న సీన్స్ ని పూర్తి చేసి ఇప్పుడు హీరోయిన్ కోసం సెర్చింగ్ మొదలు పెట్టారని సమాచారం.