ENGLISH

అఖిల్‌కి ఓ క్లారిటీ వచ్చిందా?

10 March 2018-07:30 AM

అఖిల్‌ కొత్త చిత్రానికి రంగం సిద్ధమౌతోందా? అంటే అవునంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. 'అఖిల్‌'తో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు కానీ, సబ్జెక్ట్‌ పరంగా అది పూర్‌ సబ్జెక్ట్‌. దాంతో తొలి సినిమాగా వచ్చిన 'అఖిల్‌', అఖిల్‌కి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. తర్వాత రీ లాంఛింగ్‌ మూవీగా వచ్చిన 'హలో' చిత్రం కాన్సెప్ట్‌ బాగుంది కానీ, ఎక్కడో చిన్న తేడా కొట్టేసింది. దాంతోనూ అఖిల్‌ రేసులోకి దూసుకురాలేకపోయాడు. 

లాంఛింగ్‌ మూవీస్‌గా వచ్చిన ఈ రెండు సినిమాలు ఇలా జరగడంతో అఖిల్‌ ఆ కన్‌ఫ్యూజన్‌ నుండి బయటికి రాలేకపోతున్నాడు. ఎలాంటి సబ్జెక్ట్‌ ఎంచుకోవాలి, ఏ డైరెక్టర్‌ను సంప్రదించాలి అని ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. త్రివిక్రమ్‌తో అఖిల్‌ సినిమాని రూపొందించాలని నాగార్జున అనుకున్నాడు. అయితే అది సెట్టయ్యేలా కనిపించడం లేదు. అఖిల్‌ లిస్టులో హరీష్‌ శంకర్‌ కూడా ఉన్నాడు. కానీ ఏమౌతుందో తెలీదు. 

యంగ్‌ హీరోస్‌కి మంచి హిట్స్‌ ఇస్తున్న హను రాఘవపూడితో అఖిల్‌ సినిమా ఉండబోతోందని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ అదీ జరగలేదు. హను ప్రస్తుతం శర్వానంద్‌ సినిమాతో బిజీ అయిపోయాడు. ఇక సీనియర్‌ అండ్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ అయిన కొరటాల శివ దర్శకత్వంలో అఖిల్‌ సినిమా ఉండబోతోందని కూడా టాక్‌ వినిపించింది. అయితే అది కూడా జరిగేటట్లు కనిపించడం లేదు. ఇకపోతే చిరంజీవి తనయుడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌కి 'చిరుత'తో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన పూరీ జగన్నాధ్‌తో అఖిల్‌ సినిమా ఉండబోతోందట అనే ప్రచారానికి ప్రస్తుతం అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఈ లిస్టులో యంగ్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి చేరాడు. 

'తొలిప్రేమ'తో వరుణ్‌కి తిరుగులేని హిట్‌ అందించిన వెంకీ అట్లూరి పేరు అఖిల్‌ విషయంలో ఇప్పుడు బాగా వినిపిస్తోంది. అయితే అధికారిక ప్రకటన వస్తే తప్ప తెలియదు. చూడాలి మరి అఖిల్‌కి బ్రేక్‌ ఇచ్చే ఆ కొత్త డైరెక్టర్‌ ఎవరో మరి.

ALSO READ: తాజా సంచలనం: షకీలా పాత్రలో రిచా