అల్లు అర్జున్ కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది `అల... వైకుంఠపురములో`. బన్నీ నటన, త్రివిక్రమ్ మాయాజాలం, తమన్ సంగీతం.. ఇవన్నీ ఈ సినిమాని నిలబెట్టేశాయి. సినిమా కూడా త్వరగా అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చింది. ఎడిటింగ్ అంత ఫాస్ట్‌గా సాగిపోయింది. అయితే.. ఈ సినిమా కోసం తీసి, పక్కన పెట్టేసిన ఫుటేజీ మరో 30 నిమిషాలు ఉందట. పోలీస్ స్టేషన్ సీను కంటే ముందు నాలుగైదు సన్నివేశాలున్నాయట. అవన్నీ రఘుబాబు, బన్నీ, బ్రహ్మాజీలపై తెరకెక్కించినవే. అవి ఈ సినిమాలో మాత్రం లేవు.
మూడు సన్నివేశాల్ని నిర్దాక్షణ్యంగా పక్కన పెట్టేశారని తెలుస్తోంది. కాకినాడ సమీపంలో పది రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. తెరపై చూస్తే అది ఒక నిమిషం నిడివి కూడా లేదు. దానికి సంబంధించిన షాట్లన్నీ ఎడిటింగ్‌లో పోయినట్టు తెలుస్తోంది. చివరి నిమిషాల్లో అల్లు అరవింద్, వంశీ కలిసి సినిమాని ట్రిమ్ చేశారని, ఆ సమయంలో వాళ్లిద్దరూ త్రివిక్రమ్ మాట కూడా వినలేదని, దాదాపు 30 నిమిషాలు ట్రిమ్మింగ్‌లోనే పోయాయని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి. వాటిలో కొన్ని సన్నివేశాల్ని మళ్లీ కలపాలని భావించినా - లెంగ్త్ ఎక్కువైతే, మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ ప్రేక్షకులలో తగ్గుతుందేమో అని భావించి, ఆ ప్రయత్నం కూడా మానుకున్నారు.
త్రివిక్రమ్ తన పని విషయంలో ఛండశాసనుడిగా ఉంటాడు. తాను రాసింది, తీసింది ఫైనల్ అంతే. అయితే.. మొదటి సారి త్రివిక్రమ్ కాస్త తగ్గాడు. అది అజ్ఞాతవాసి మహిమే. ఈ సినిమాతో చాలా నష్టపోయినా హారిక హాసిని `అల వైకుంఠపురములో`తో నిలదొక్కుకోగలిగింది. అందుకే ఆ నిర్మాతల మాటని త్రివిక్రమ్ కూడా వినాల్సివచ్చింది.
ALSO READ: అనుష్క 'నిశ్శబ్ధం'గా ఉండిపోయిందే!