ENGLISH

శాకుంత‌లంని ర‌క్షించిన అమేజాన్‌

26 April 2023-16:04 PM

ఓటీటీలు తెలుగు సినిమాకి శ్రీ‌రామ‌ర‌క్ష‌గా మారాయి. సినిమా ఎంత అట్ట‌ర్ ఫ్లాప్ అయినా స‌రే... ఓటీటీల రూపంలో ఎంతో కొంత మొత్తం వెన‌క్కి తిరిగి వ‌స్తోంది. దాంతో నిర్మాత‌లు రోడ్డున ప‌డ‌కుండా కాస్త తేరుకోగ‌లుగుతున్నారు. శాకుంత‌లం విష‌యంలో ఇదే జ‌రిగింది. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స‌మంత క‌థానాయిక‌గా రూపొందించిన చిత్ర‌మిది. దాదాపు రూ.70 కోట్లు ఖ‌ర్చు పెట్టారు. తొలి రోజే డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చేసింది. తొలి షోకే.. థియేట‌ర్లో జ‌నాలు క‌నిపించ‌లేదు. ఈ యేడాది అతి పెద్ద ఫ్లాపుల్లో శాకుంత‌లం కూడా చేరిపోయింది.


అయితే అమేజాన్ ప్రైమ్‌తో డీల్ కుద‌ర‌డం వ‌ల్ల శాకుంత‌లం కాస్త కోలుకోగ‌లిగింది. ఈ సినిమాకి నాన్ థియేట‌రిక‌ల్ రైట్స్ రూపంలో దాదాపుగా రూ.32 కోట్లు వ‌చ్చాయి. అంటే.. అటూ ఇటుగా స‌గం డ‌బ్బులు వెన‌క్కి వ‌చ్చిన‌ట్టే. ఎలా చూసినా ఈ ప్రాజెక్ట్ తో రూ.30 కోట్లు న‌ష్టం. అందులో రూ.25 కోట్లు గుణ‌శేఖ‌ర్ భ‌రించాల్సివ‌చ్చింది. ఈ సినిమాలో దిల్ రాజుకీ వాటా ఉన్న మాట వాస్త‌వం. కాక‌పోతే.. ఆయ‌న‌ది చిన్న వాటా. కాబ‌ట్టి స్వ‌ల్ప న‌ష్టాల‌తో బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగారు.