ENGLISH

రామ్ చ‌ర‌ణ్ కోసం రెహ‌మాన్‌

26 April 2023-15:56 PM

బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఈచిత్రానికి రెహ‌మాన్ సంగీతం అందించ‌నున్నాడు. ఇటీవ‌లే బుచ్చిబాబు - రెహ‌మాన్ మ‌ధ్య భేటీ జ‌రిగింది. బుచ్చి చెప్పిన క‌థ నచ్చ‌డంతో ఈ సినిమాకి సంగీతం ఇవ్వ‌డానికి ప‌చ్చ జెండా ఊపాడు రెహ‌మాన్. త్వ‌ర‌లోనే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొద‌లు కానున్నాయి.


బుచ్చిబాబు తొలి సినిమా ఉప్పెన మ్యూజిక‌ల్ హిట్. ఆ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. ఆ సినిమా విజ‌యంలో సంగీతానిది కీల‌క పాత్ర‌. పైగా సుకుమార్ - దేవిశ్రీ బాండింగ్ తెలియంది కాదు. దేవి లేక‌పోతే.. సుకుమార్ సినిమా చేయ‌డు. సుకుమార్ శిష్యులూ దేవినే కావాలంటారు. అలాంటిది బుచ్చి ఇప్పుడు రెహ‌మాన్ వైపు మొగ్గు చూపించ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.


రెహ‌మాన్ ఓ సూప‌ర్ హిట్ ఆల్బ‌మ్ ఇచ్చి చాలాకాల‌మైంది. కాక‌పోతే.. మేక‌ర్స్‌కి ఇప్ప‌టికీ రెహ‌మాన్ అంటే... గురి. త‌న నేప‌థ్య సంగీతం సినిమాకి ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తున్నారు. బుచ్చి రాసుకొన్న క‌థ‌లో.. నేప‌థ్య సంగీతానికి అధిక ప్రాధాన్యం ఉంది. పైగా పాన్ ఇండియా ట్యాగ్ లైన్ ఉండ‌నే ఉంది. అందుకే.. రెహ‌మాన్ ని సంప్ర‌దించిన‌ట్టు టాక్‌.