ఏపీలో థియేటర్ల పరిస్థితి అస్తవ్యస్థంగా తయారైంది. తెలంగాణలో 100 శాతం ఆక్యుపెన్సీకి, నైట్ షోలకూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలో రోజుకి 5 ఆటలు ప్రదర్శించుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రాలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. అక్కడ ఇంకా 50 శాతమే ఆక్యుపెన్సీ. పైగా నైట్ షోలు లేవు. అన్నింటికింటే ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో టికెట్ రేట్లు తగ్గిస్తూ జీవో విడుదల చేశారు. ఈ రేట్లకు సినిమాని నడుపుకోలేం అంటూ... ఏపీలో చాలా థియేటర్లు మూసేశారు. పెద్ద సినిమాలు విడుదలకు వెనకడుగు వేస్తున్నాయంటే కారణం ఇదే. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులలో పెద్ద సినిమాలు విడుదల కావాల్సివుంది. ఏపీలో జగన్ సర్కార్ టికెట్ రేట్ల జీవో వెనక్కి తీసుకోకపోతే... సినిమాలు విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ ఈ విషయంలో వెనకడుగు వేసిందని తెలుస్తోంది. తగ్గించిన టికెట్ రేట్ల జీవోని వెనక్కి తీసుకుంటూ.. ఏపీ ప్రభుత్వం కొత్త జీవోని విడుదల చేయబోతోందని టాక్. వచ్చే వారంలో ఈ జీవో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతో ఆగస్టు చివరి వారం నుంచి పెద్ద సినిమాలు వరుస కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వినాయక చవితి, దసరాలకు పెద్ద సినిమాలు చాలా రాబోతున్నాయి. వాటన్నింటికీ ఈ నిర్ణయం పెద్ద ఊరటకలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ALSO READ: రూమర్లకు 'లవ్ స్టోరీ' చెక్!