ENGLISH

సినీ పరిశ్రమకి కరోనా భయం ఇంకెన్నాళ్ళు.?

29 December 2020-18:00 PM

సినిమా థియేటర్లు తెరచుకున్నాయి.. పెద్ద సినిమాల రిలీజ్‌కి రంగం సిద్ధమవుతోంది. 50 శాతం ఆక్యుపెన్సీతో కూడా 'సోలో బ్రతుకే సో బెటర్‌' డీసెంట్‌ హిట్‌ అనిపించుకుంది. అయినాగానీ, సినీ పరిశ్రమకు కరోనా భయాలు ఇంకా తొలగిపోలేదు. తాజాగా, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించారు. తనను గత కొద్ది రోజులుగా కలిసినవారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

 

ఇది, పరిశ్రమలో కరోనా వైరస్‌ తీవ్రతను చెప్పకనే చెబుతోంది. కొద్ది రోజుల క్రితం చిరంజీవికి కరోనా అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. చిరంజీవే స్వయంగా ఆ విషయాన్ని వెల్లడించారు, ఆ తర్వాత అది ఫాల్స్‌ పాజిటివ్‌ అని తేలింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కరోనా వైరస్‌ వల్ల ఇదివరకటిలా తీవ్ర అనారోగ్య సమస్యలు కలగడంలేదు. అలాగని, కరోనా వైరస్‌ని లైట్‌ తీసుకోవడానికి వీల్లేదు. తమన్నా లాంటి కొందరు అందాల భామలు కరోనా నుంచి కోలుకున్న విషయం విదితమే.

 

బండ్ల గణేష్‌ కూడా కరోనా నుంచి కోలుకున్నారు. రకుల్‌ కూడా కరోనా బారిన పడింది, కోలుకున్నట్టు తాజాగా ప్రకటించింది. అయితే, కరోనా వైరస్‌ కారణంగా ఆయా సినిమాల షూటింగ్‌ షెడ్యూల్స్‌ దారుణంగా ఇబ్బంది పడతాయి. అదే సినీ పరిశ్రమకి పెద్ద సమస్య. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే తప్ప, ఇప్పట్లో ఈ సమస్య తీరేలా కన్పించడంలేదు. పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో తెలిసినా, సినీ పరిశ్రమ ముందడుగు వేయక తప్పడంలేదు. అది తప్పదు కూడా.! సీనియర్‌ సినీ ప్రముఖులు మాత్రం ఒకింత అప్రమత్తంగా వుండాల్సిందే.

ALSO READ: ర‌జ‌నీకి ఆదిలోనే హంస‌పాదు