ENGLISH

ఆమె నడుము మడతలో ఏముంది?

17 January 2018-07:30 AM

'పద్మావత్‌' సినిమా ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సినిమా ఇది. పలు రాష్ట్రాల్లో నిషేధం ఎదుర్కొంటోన్న సినిమా కూడా. రాజ్‌పుత్‌ కర్ణిసేన ఈ సినిమాకి వ్యతిరేకంగా ఆందోళనల బాట పట్టడంతో సినిమా విడుదల ఆలస్యమయ్యిందిగానీ, లేదంటే ఈ సినిమా గత ఏడాది అంటే 2017 డిసెంబర్‌ 1న విడుదలయి ఉండాల్సింది. 

ఎలాగైతేనేం విడుదల ఆటంకాల్ని తొలగించుకుని 'పద్మావతి' పేరు కాస్తా 'పద్మావత్‌'గా మార్చుకుని జనవరి 24న సినిమా విడుదల కానుండగా, పలు రాష్ట్రాలు సినిమాపై నిషేధాన్ని తొలగించేందుకు మాత్రం సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఇంకో వైపున కొత్తగా ఈ సినిమాపై వివాదాలు పుట్టుకొస్తున్నాయి. సినిమాలోని 'గుమర్‌' పాటలో హీరోయిన్‌ దీపికా పడుకొనే నడుము వివాదాస్పదమయ్యింది. తాము అత్యంత పవిత్రంగా పూజించే రాణి పద్మావతిని అసభ్యకరంగా చూపిస్తున్నారంటూ ఆ పాటలోని దీపికా పడుకొనే నడుము భాగం చూపించడం పట్ల కొత్త కొత్తగా ఆందోళనలు మొదలు పెట్టారు కర్ణిసేన సభ్యులు. 

అయితే వారి ఆందోళనలపై వ్యతిరేకతలూ వ్యక్తమవుతున్నాయి. మహిళలకు సహజమైన శారీరక ఆకృతిని వక్ర కోణంలో చూడాల్సిన అవసరమేంటని 'పద్మావత్‌' మద్దతుదారులు అంటున్నారు. పాటలోని ఔన్నత్యం చూడాలనీ, అందాన్ని ఆరాధించాలి తప్ప దాని చుట్టూ వివాదాలు చేయరాదని వారు సూచిస్తుండడం గమనించదగ్గ అంశం. ఇలాంటి విషయాల్లో చాలా ఘాటుగా స్పందించే దీపికా పడుకొనే ఈసారి ఎందుకో వివాదాల జోలికి వెళ్ళడంలేదు. ఆమె మాత్రమే కాదు, చిత్ర యూనిట్‌ సభ్యులెవరూ ఇటీవలి కాలంలో సినిమా గురించి వస్తోన్న విమర్శలపై స్పందించడం మానేశారు. 

సినిమా విడుదలవ్వాలంటే అలాంటి వివాదాల్ని పట్టించుకోకూడదని దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ వారందరికీ గట్టిగా క్లాస్‌ తీసుకున్నారట. ఏదేమైనా నడుము మడత కూడా వివాదాస్పదమవడం శోచనీయం.

ALSO READ: అమల పాల్ కి జైలు తప్పదా?