ENGLISH

కొండంత అండ - ఇకపై ఎవరంట?

31 May 2017-18:45 PM

తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కుని కోల్పోయింది. ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌, ఓ చిన్న టెక్నీషియన్‌ - ఇలా ఎవరైనాగానీ తమకు ఓ సమస్య వచ్చిందంటే వారికి వెంటనే గుర్తుకొచ్చే పేరు దాసరి నారాయణరావే. ఆయన దగ్గరకు వెళితే సమస్య పరిష్కారమైపోతుందనే నమ్మకం ఇప్పటిదాకా అందరికీ ఉండేది. పెద్ద నిర్మాతలు, పెద్ద పెద్ద దర్శకులు సైతం తమకేవైనా సమస్యలొస్తే దాసరి వద్దకు వెళ్ళేవారు. ఇప్పుడు ఆ దాసరి నారాయణరావు లేరు. మరి తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరు? ఉండటానికైతే ఎంతోమంది 'పెద్దవాళ్ళు' ఉన్నారుగానీ వారిలో దాసరి అంత పెద్ద మనసు ఉన్నవారెవరని సినీ పరిశ్రమలోనే ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకుంటున్నారు. 150 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు సుమారు 250 చిత్రాలకు రచయితగా పనిచేశారు. పాటలు రాశారు, పాడారు, నటించారు ఇంకా చాలా చాలా చేశారు. అలా సినీ పరిశ్రమలో అన్ని విభాగాలపైనా ఆయనకు పట్టు ఉంది. పట్టు మాత్రమే కాదు, సినీ పరిశ్రమకు చెందిన అన్ని విభాగాల్లోనివారికీ ఆయన మీద గౌరవం ఉంది. అది దాసరి ప్రత్యేకత. అలాంటి మహానుభావుడు మళ్ళీ పుట్టడు. అందుకే తెలుగు సినీ పరిశ్రమ అంతా ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు ముందుకొచ్చింది. దర్శకుడు క్రిష్‌ మాటల్లో అయితే దాసరి లేరని ఎవరన్నారు? దర్శకుడికి ఎక్కడ గౌరవం దక్కితే అక్కడ దాసరి ఉంటారు. నిజమే దర్శకత్వానికి గౌరవం తెచ్చిన వ్యక్తి దాసరి నారాయణరావు.

ALSO READ: కాజల్‌ బికినీ హంగామా