ENGLISH

స‌మంత‌కు అండ‌గా టాలీవుడ్... దిగొచ్చిన కొండా సురేఖ‌

03 October 2024-22:11 PM

ఈ మధ్య కాలంలో రాజకీయాలంటే వ్యక్తుల్ని టార్గెట్ చేయటమే అయిపోయింది. తాజాగా కాంగ్రెస్ మంత్రి  కొండా సురేఖ పొలిటికల్ వార్ లోకి సంబంధం లేని అక్కినేని ఫ్యామిలీని తీసుకువచ్చి, చైతు, సామ్, డివోర్స్ కి కేటీఆర్ కారణమంటూ ఏవేవో మాట్లాడారు. వెంటనే నాగార్జున 'X ' వేదికగా స్పందించి, సురేఖ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. 


జంతువులకి , పక్షులకి కూడా ఐక్యత ఉంటుంది. తమ మీద ఎవరైనా దాడి చేస్తే వెంటనే అవన్నీ ఒక్కటయ్యి ఎదిరిస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఐక్యత ఉందని మొదటిసారి నిరూపించారు. జనరల్ గా ఎవరిపైన అయినా వ్యక్తిగత విమర్శలు వస్తే ఎవరూ పెద్దగా రెస్పాండ్ అవరు. కానీ ఈ సారి చైతు, సామ్ ల పై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ పలువురు సెలబ్రిటీస్ క్షణాల్లో రియాక్ట్ అయ్యారు. మొదట నాగ్ రియాక్ట్ అయ్యారు. తరవాత అమల, సమంత, చైతు, అఖిల్, సుశాంత్ ఇలా ఫ్యామిలీ  మొత్తం స్పందించారు. తరవాత ప్రకాష్ రాజ్, చిరంజీవి, ఎన్టీఆర్, నాని, శ్రీకాంత్ ఓదెల, చిన్మయి, రోజా, కుష్బూ, మంచు ల‌క్ష్మి, వ‌రుణ్‌తేజ్‌ మొదలైన వారంతా స్పందించారు.  


గౌరవనీయులైన మహిళా మంత్రి అంటూ సంభోదించి ఆమె చేసిన వ్యాఖ్యల్ని దుయ్యబట్టారు.  సెలబ్రిటీలు, సినిమా వ్యక్తులను వారి రీచ్ కోసం వాడుకోవడం సిగ్గుచేటని, మా సినీ పరిశ్రమ సభ్యులపై ఇలాంటి విమర్శలు చేస్తే అందరం కలిసి వ్యతిరేకిస్తాం అని, సంబంధం లేని వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను తమ రాజకీయాల్లోకి లాగడం, ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి రాజకీయంగా ఉపయోగించుకునే స్థాయికి ఎవరూ దిగజారకూడదు అని పలువురు హెచ్చరించారు. సమాజాన్ని ఉద్దరించడానికి నాయకులను ఎన్నుకుంటాము, అనవసర ప్రసంగాలు చేసి ప్రజల మనసుల్ని కలుషితంగా మార్చకండి అని, రాజకీయ నాయకులు, గౌరవ స్థానాల్లో ఉన్న వ్యక్తులు ప్రజలకు మార్గదర్శకంగా  ఉండాలి అని హితవు పలికారు. సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, టాలీవుడ్ మొత్తం డిమాండ్ చేసింది. 


సురేఖ వ్యాఖ్యలు కరక్ట్ కాదని, సినిమా ఇండస్ట్రీ వ్యక్తులని టార్గెట్ చేయటం. రాజకీయ లబ్ది కోసం హీరోయిన్స్ వ్యక్తి గత జీవితాల్ని అపహాస్యం చేయటం సరికాదని మండి పడ్డారు. దెబ్బకి సురేఖ దిగొచ్చారు, తాను కామెంట్ చేసి 24 అవర్స్ అవకముందే, తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలా ఇండస్ట్రీ మొత్తం ఒక తాటిపైకి వచ్చి విజయం సాధించారు. మా జోలికి వస్తే, అనవసరంగా మా మీద విమర్శలు చేస్తే ఊరుకోమని అందరూ ముక్త కంఠంతో హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.