చిత్రం: స్వాగ్
దర్శకత్వం: హసిత్ గోలి
కథ - రచన : హసిత్ గోలి
నటీనటులు: శ్రీ విష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, రవి బాబు, సునీల్ , తదితరులు
నిర్మాతలు: టీజీ. విశ్వప్రసాద్.
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ : వేదరమణ శంకరన్
ఎడిటర్: విప్లవ్ నైషధం
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ: O4 అక్టోబర్ 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.5/5
శ్రీ విష్ణు సినిమా అంటేనే రొటీన్ కి భిన్నంగా ఉంటుంది. కెరియర్ మొదటి నుంచి ప్రతి సినిమాకి కొత్తగా ట్రై చేస్తూ ఉన్నాడు. మూస ధోరణికి దూరంగా, కమర్షియల్ హంగులకి తావివ్వకుండా కథలని సెలక్ట్ చేసుకుంటాడు శ్రీ విష్ణు. హీరో ఎలివేషన్స్, భారీ సెట్స్, గెటప్ లు, యాక్షన్ సీక్వెన్స్ ఉండవు. కేవలం కథని నమ్ముకుని బరిలో దిగుతాడు. శ్రీ విష్ణు సినిమాల్లో కథే హీరో. కామెడీ పంచుతూ మంచి సందేశాన్ని ఇస్తూ సాగుతాయి శ్రీవిష్ణు మూవీస్.ఈ మధ్య 'సామజ వరగమన' 'ఓం భీం బుష్'తో హిట్ కొట్టిన శ్రీ విష్ణు ఇప్పడు 'స్వాగ్' తో హ్యాట్రిక్ కొట్టనున్నాడని వీరి కాన్ఫిడెన్స్ చూస్తే తెలుస్తోంది. శ్రీ విష్ణు సినిమా చాలా బాగుంటుందని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు. బెస్ట్ ఇంటర్వెల్, బెస్ట్ క్లైమాక్స్, బెస్ట్ మూవీని చూడబోతున్నారు అని దర్శకుడు కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు. ఈ మూవీ నేడు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. సినిమా ఎలా ఉందో,హీరో కి హ్యాట్రిక్ హిట్ దొరికిందో లేదో, ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు చెప్పిన మాటలు నిజమయ్యాయో లేదో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
భవభూతి( మూడో శ్రీ విష్ణు) దివాకర్ పేట అనే ప్రాంతంలో ఎస్సైగా పనిచేసి రిటైర్ అయ్యే టైంలో అతనికి రావాల్సిన పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ రాకుండా ధనలక్ష్మి అనే ఓ లేడీ ఆఫీసర్ అడ్డుకుంటుంది. డబ్బులు రాలేదని బాధ పడుతున్న సమయంలో తాను శ్వాగణిక వంశంలో జన్మించిన వ్యక్తి అని, వారసత్వంగా తనకు కోట్ల రూపాయల ఆస్తి వచ్చే అవకాశం ఉందని ఒక లేఖ వస్తుంది. దాని సాయంతో వంశవృక్ష నిలయం వెళ్లిన భవభూతి అక్కడ ఆఫీసర్ (గోపరాజు రమణ)ని నమ్మించి ఆస్తి దక్కించుకోవాలి అని అనుకుంటాడు. ఈ లోగా సేమ్ అలాంటి లెటర్ పట్టుకుని అనుభూతి (రీతూ వర్మ) కూడా అక్కడికి వస్తుంది. శ్వాగణిక వంశ వారసురాల్ని తానే అని, తన వారసత్వాన్ని నిరూపించే రాగి పలక తన దగ్గర ఉందని, తనకి ఆ ఆస్తి కావాలని పట్టుబడుతుంది. ఇదంతా జరుగుతుండగానే సింగ ( నాలుగో శ్రీ విష్ణు) కూడా అలాంటి లేఖ పట్టుకుని వంశవృక్ష నిలయానికి వస్తాడు. అసలు వీళ్ళకీ లెటర్ రాసింది ఎవరు? ఈ శ్వాగణిక ఆస్తి ఎవరికి దక్కుతుంది? వారసులు ఎవరు? తండ్రి యయాతి (రెండో శ్రీ విష్ణు) నుంచి భవభూతి చిన్నప్పుడే ఎందుకు దూరమయ్యాడు? సింగ, భవభూతి ఒకేలా ఎలా ఉన్నారు? 1551 ఏళ్ల క్రితం మగాళ్లని కాలి కింద చెప్పుల్లా చూసే వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి (రీతూ వర్మ)ని మాయ చేసి పురుషాధిక్యం పెంచడానికి శ్వాగణిక వంశ మహారాజు భవభూతి (శ్రీ విష్ణు) ఏం చేశాడు? రేవతి (మీరా జాస్మిన్), విభూతి ఎవరు? చివరకు ఆస్తి ఎవరికి దక్కింది?లాంటి విషయాలు తెలియాలంటే సినిమా థియేటర్స్ లో చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలో స్వాగ్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఇందులో పురుషాధిక్యత, స్త్రీ సాధికారత, మాతృస్వామ్యం, పితృస్వామ్యం మొదలైన అంశాలు గురించి చర్చించారు. చివరికి లింగ వివక్ష లేకుండా అందరినీ సమానత్వంతో చూడటమే మానవత్వం అని మెసేజ్ ఇచ్చేలా ఉంది 'స్వాగ్' మూవీ. దర్శకుడు ఇది వరకు శ్రీ విష్ణు తో రాజ రాజ చోర మూవీతో అలరించాడు. అతనికున్న తెలుగు ప్రావీణ్యత సంభాషణల్లో కనిపించింది. దర్శకుడి గా మెప్పించి, డైలాగ్ రైటర్ గా కూడా అలరించాడు. దర్శకుడిగా హసిత్ గోలి ఫుల్ మార్క్స్ కొట్టేసాడు. కానీ కథ విషయంలో కొంచెం జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. స్క్రీన్ ప్లే వలన ఆడియన్స్ కథ అర్థం కాక అయోమయానికి గురి అవుతారు. ట్విస్టులు, ఫ్లాష్ బ్యాక్ లు రివీల్ చేసే క్రమంలో స్క్రీన్ ప్లే గందరగోళంగా మారింది.
కథ కొత్తది కాకపోయినా రైటింగ్ స్టైల్ తో ఆడియన్స్ ని కొంచెం మ్యానేజ్ చేసారు. రాజరికపు రోజుల నుంచి మొదలుపెట్టి వారి వారసులను కనక్ట్ చేస్తూ రాసుకున్న తీరు బాగానే ఉంది. లింగభేదం లేదన్న సాధారణ విషయాన్ని చెప్పటానికి దర్శకుడు కొంచెం కష్టమైన దారిని ఎంచుకుని కన్ఫ్యూజ్ అయ్యాడు. వింజామర సామ్రాజ్యం, శ్వాగణిక వంశం, 1500 ల్లో మొదలై వారి వంశాలు, తరతరాల వారసులు అంటూ సుదీర్ఘమైన కథను రెండున్నర గంటల్లోనే చెప్పాల్సి రావటంతో గందర గోళం ఏర్పడింది. కొన్ని సీన్స్ కావాలని తీసేసినట్లు తెలుస్తుంది. కనక్టివిటీ దెబ్బతింది. హడావిడిగా కథ నడిపించారు. ఫస్ట్ ఆఫ్ సరదాగానే సాగిపోతుంది. ఇంటర్వెల్ టైంకి కొద్దిగా డౌట్స్ క్లియర్ అవుతాయి. ఇంటర్వెల్ తర్వాత సినిమా ఎమోషనల్ గా ఆలోచింపచేసే విధంగా ఉంటుంది. శ్రీ విష్ణు సినిమా అంటే కామెడీ, పంచ్ డైలాగ్స్ ఆశించి వెళ్తాం కానీ ఈ మూవీలో ఎమోషనల్ పార్ట్ ఎక్కువ ఉంది.
నటీ నటులు:
ఎలాంటి పాత్ర అయినా మెప్పించేగలిగేలా చేయటం శ్రీవిష్ణు స్పెషాలిటీ. కామెడీ చేస్తూ ఎమోషన్స్ కూడా అద్భుతంగా పండించగలరు. అందుకే స్వాగ్ లో శ్రీ విష్ణు ని ఎంచుకున్నాడు దర్శకుడు హసిత్ గోలి. ఇందులో 'విభూతి' పాత్ర సూపర్ గా చేసాడు శ్రీ విష్ణు. స్వాగ్ లో శ్రీ విష్ణు ఐదు పాత్రలు చేసాడు. ఏడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించాడు. ఇందులో విభూతి పాత్ర మలిచిన విధానం, శ్రీ విష్ణు యాక్షన్ చాలా బాగుంది. మిగతా పాత్రల్లో శ్రీ విష్ణు నటన బాగానే ఉంది. కానీ ఎస్సై భవభూతి పాత్రలో డబ్బింగ్, గెటప్ కుదరలేదు. రీతు వర్మ కూడా రెండు పాత్రలు పోషించింది, నటన పరంగా ఓకే అనిపించుకుంది. రీతూ వర్మ 'టక్ జగదీశ్' సినిమా తరువాత తెలుగులో ఇదే నటించటం. మీరాజాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పాత్రలో మెరిసింది. మీరా జాస్మిన్ స్క్రీన్ ప్రజెన్స్, నటన బావున్నాయి. ఆ పాత్రకు హుందాతనం తెచ్చాయి. శ్రీవిష్ణుతో రొమాంటిక్ సీన్స్, కీలకమైన సన్నివేశాల్లో దక్షా నగార్కర్ కనిపించింది. ఈ సినిమాకి దక్ష గ్లామర్ డాల్ గా మిగిలింది. గోపరాజు రమణ- రవిబాబు సీన్స్ పరవాలేదని పించాయి. గెటప్ శ్రీను కామెడీ ఓకే. సునీల్, పృథ్వి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ :
'స్వాగ్' ని దర్శకుడు కొంతవరకు మెప్పించాడు. కొంత తడబడ్డాడు. సినిమా ఆసక్తికరంగా మొదలై, తరవాత అయోమయానికి గురిచేసి, ఇంటర్వెల్ తరువాత కథ ఏమిటన్నది అర్థం అవుతుంది. ఇంటర్వెల్ తర్వాతే దర్శకుడు శ్రద్ద పెట్టాడు. స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం శ్రద్దపెట్టి ఉంటే మంచి సినిమాగా నిలిచేది. వివేక్ సాగర్ సంగీతం బాగుంది. పాటలు అలరించాయి. రెట్రో సాంగ్ ట్యూన్ అద్భుతంగా ఉంది. కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైన్ టీమ్ పడిన కష్టం స్క్రీన్ మీద తెలుస్తోంది. డిఫరెంట్ టైమ్ లైన్స్ వేరియేషన్స్ బాగా చిత్రించారు. మేకప్ వర్క్, ఆర్ట్ వర్క్ సినిమాను బాగా ఎలివేట్ చేస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నటీనటులు
సంగీతం
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
కథ
స్క్రీన్ ప్లే
ఎంటర్ టైన్మెంట్ మిస్సింగ్
ఫైనల్ వర్దిక్ట్ : జస్ట్ భాగ్...!
ALSO READ: IN ENGLISH