చిత్రం: గాంధీ తాత చెట్టు
దర్శకత్వం: పద్మావతి మల్లాది
కథ - రచన: పద్మావతి మల్లాది
నటీనటులు: సుకృతి వేణి, ఆనంద్ చక్ర పాణి, రాగ మయూరి, రఘు రామ్, భాను ప్రకాష్, నేహాల్ ఆనంద్ కుంకుమ.
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్, శేష సింధు రావు
సంగీతం: రీ
సినిమాటోగ్రఫీ: విశ్వ దేవబత్తుల, శ్రీజిత్ చెరువుపల్లి
ఎడిటర్: హరి శంకర్ టి.ఎన్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్
విడుదల తేదీ: 24 జనవరి 2025
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.75/5
పాన్ ఇండియా దర్శకుడిగా సుకుమార్ ఒక వైపు సత్తా చాటుతుంటే ఇంకో వైపు ఆయన కూతురు సుకృత వేణి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకృత వేణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'గాంధీ తాత చెట్టు' ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకి నోచుకుంది. అంతే కాదు ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణికి కూడా పురస్కారం దక్కింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో సుకుమార్ కూడా పాల్గొనడంతో 'గాంధీ తాత చెట్టు' కి కావాల్సినంత బజ్ ఏర్పడింది. ఈ సినిమా ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అసలు గాంధీ తాత చెట్టు అని టైటిల్ ఎందుకు పెట్టారు. అసలు కథ ఏంటి, సుకృత తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించిందో లేదో ఈ రివ్యూ లో చూద్దాం.
కథ:
నిజామాబాద్ జిల్లా ఆల్లూరులో కథ మొదలవుతుంది. ఈ గ్రామంలో ఉండే రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి)కు 15 ఎకరాల పంట పొలం ఉంటుంది. అది తండ్రి నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి. మహాత్మ గాంధీ గుర్తుగా ఆ భూమిలో తన చిన్నప్పుడు తండ్రితో కలిసి ఒక వేప మొక్క నాటుతాడు. అందుకే ఆ వేప చెట్టు అంటే రామచంద్రయ్యకి ప్రాణం. ఎక్కువగా అక్కడే గడుపుతుంటాడు. తన ప్రాణమే ఆ చెట్టులో ఉందని చెప్తాడు. గాంధీ సిద్ధాంతాల్ని తూచా తప్పకుండా ఆచరించే రామచంద్రయ్య తన మనవరాలికి గాంధీ (సుకృతివేణి) అని పేరు పెడతాడు. గాంధీకి తాత రామచంద్రయ్య అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తాత చెప్పే గాంధీ కథలు విని, వాటిని అనుసరిస్తుంది. లోకల్ పొలిటీషన్ చేసిన కుట్ర కారణంగా ఊర్లో ఉన్న చెరకు ఫ్యాక్టరీ మూత పడుతుంది. చెరుకు రైతులంతా అప్పులపాలవుతారు. అదే టైం లో ఊర్లోకి కెమికల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని, ఉపాది దొరుకుతుంది అని ఆశ కల్పిస్తాడు బిజినెస్ మెన్ సతీష్(రాగ్ మయూర్). రైతులు కూడా సతీష్ చెప్పిన మాటలు నమ్మి పొలాలన్ని అమ్మేస్తారు. రామచంద్రయ్య ఫ్యాక్టరీ నిర్మిస్తే తను ప్రాణంగా పెంచుకుంటున్న చెట్టును కొట్టేస్తారనే బాధతో పొలం అమ్మటానికి నిరాకరిస్తాడు. కానీ కొడుకు గొడవపడటంతో ఆ దిగులుతో రామచంద్రయ్య చనిపోతాడు. తాత ఇష్టపడిన చెట్టుని కాపాడటానికి గాంధీ రంగంలోకి దిగుతుంది. తన తాత ప్రాణానికి ప్రాణం అయిన ఆ చెట్టుని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలే ఈ సినిమా కథ. చివరికి చిన్నారి గాంధీ ఏం చేసింది? ఆ చెట్టుని కాపాడగలిగిందా? తాత బోధించిన గాంధీజీ సిద్ధాంతాలతో చేసిన శాంతియుత పోరాటం ఫలించిందా? చివరికి ఏమయ్యింది అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
గాంధీ సిద్ధాంతాలు ఆచరిస్తూ, అభిమానిస్తూ పెరిగిన ఒక చిన్న పిల్ల తన ఊరిని, తాత ఇష్టపడే చెట్టుని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అన్న కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కించారు. కథ మొత్తం గాంధీ అనే అమ్మాయి చుట్టూ, చెట్టు చుట్టూ తిరుగుతుంది. అందుకే టైటిల్ కూడా అదే పెట్టారు. మొక్కలు, చెట్లు ప్రాధాన్యత వాటితో ఉన్న ఎమోషన్ ని బాగానే తెరకెక్కించారు దర్శకురాలు. హింస, ఆవేశం, కోపం మితిమీరుతున్న నేటి సమాజంలో అహింసవాదాన్ని చెప్పే ప్రయత్నం చేసారు. ఒక ఎమోషన్ కోసం, గాంధీ చేసే ప్రయత్నాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కానీ వాస్తవాలకి అతీతంగా ఉంటాయి ఆ ప్రయత్నాలు. స్లో నేరేషన్ కారణంగా కూడా ప్రేక్షకులకి బోర్ కొడుతుంది. సినిమా ప్రారంభంలోనే టైంవేస్ట్ చేయకుండా తాత,గాంధీ పాత్రలు, ఆ చెట్టు ఎందుకు ప్రత్యేకతో పరిచయం చేస్తూ మొదలుపెట్టారు. కానీ రాను రాను కథ స్లో గా అనిపిస్తుంది.
తాత చనిపోయినప్పుడు చెట్టు ఏడుస్తూ చెప్పే మాటలు ప్రేక్షకుల్ని కదిలిస్తాయి. ఫస్టాఫ్ ఎంటర్ టైనింగ్ గా ఉంది. సెకండాఫ్ మాత్రం చాలా స్లోగా ఉంది. ప్రేక్షకుడి ఊహకి అందని ట్విస్ట్ లు లేవు. కొన్ని మాటలు చాలా బాగున్నాయి. తాత బిజినెస్ మెన్ కి చెప్పే మాటలు అయినా, కొడుకుతో తాత చెప్పిన మాటలు మనల్ని ఆలోచింప జేస్తాయి. 'పంట పండే స్థలాన్ని అమ్మడం అంటే కన్న తల్లిని వ్యభిచారానికి పంపించినట్లే' అన్న డైలాగ్ మనల్ని ఉలిక్కి పడేలా చేస్తుంది. కమర్షియల్ లెక్కలు తెలియని మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలిం గాంధీ తాత చెట్టు. సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చేలా నిజాయితీగా ఓ ప్రయత్నం చేసింది దర్శకురాలు పద్మావతి మల్లాది.
నటీ నటులు:
సుకృతి వేణి మొదటి సినిమాతో అద్భుత నటన ప్రదర్శించింది. తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. తన నటనతో సుకృతి ఈ సినిమాకి ప్రధాన బలం అయ్యింది. గాంధీ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా తాను పోషించే పాత్ర కోసం రియల్ గానే గుండు గీసుకుంది. స్టార్ హీరోయిన్స్ కూడా చేయలేని పని చేసింది సుకృత. దీని బట్టే తెలుస్తోంది సుకృతకి సినిమాపై ఎంత ఆసక్తి ఉందో. అన్ని హావా భావాలను చక్కగా పలికించింది. పాత్రకు తగ్గా యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ సూపర్ గా ఉంది. రామచంద్రయ్య పాత్ర పోషించిన ఆనంద చక్రపాణి సినిమాకి ఇంకో బలం. గాంధేయవాదిగా, ప్రకృతి ప్రేమికుడిగా తన క్యారెక్టరలో ఒదిగిపోయారు. ఆనంద్ చక్ర పాణి స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. బిజినెస్ మ్యాన్ సతీష్‌గా రాగ్ మయూర్ ఆకట్టుకున్నాడు. మిగతా వారంతా కొత్తవారైనా వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు.
టెక్నికల్:
దర్శకురాలు పద్మావతి ప్రయత్నాన్నీ మెచ్చుకోక తప్పదు. నేటి ట్రెండ్ కి విభిన్నమైన కథని ఎంచుకుంది. క్రైమ్, హింస, రక్తపాతం, శృంగారం వీటన్నిటికీ దూరంగా పద్మావతి మల్లాది ఎంచుకొన్న పాయింట్, దాని చుట్టూ ఎమోషన్స్ కూడా బాగా ఎలివేట్ చేసారు. సైమన్ గో బ్యాక్ పాయింట్‌ను కథకి అనుసంధానించిన విధానం, గాంధీపై వచ్చే విమర్శలకు ఇచ్చిన వివరణ సూపర్. రీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. శ్రీజిత, విశ్వ అందించిన సినిమాటోగ్రఫీ పర్వాలేదానిపిస్తుంది. ఎడిటింగ్ పై ఇంకొంచెం శ్రద్ద పెడితే బాగుండేది. ఇలాంటి ఒక సినిమాని నమ్మి నిర్మాతలు ముందుకు రావటమే గొప్ప విషయం. ఖర్చుకి కూడా వెనకాడలేదని తెలుస్తోంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
సుకృతి వేణి
కథ, మెసేజ్
సహజత్వం
మైనస్ పాయింట్స్
స్లో నేరేషన్
కమర్షియల్ అంశాలు మిస్సింగ్
ఫైనల్ వర్దిక్ట్ : కమర్షియల్ లెక్కలులేని మెసేజ్ పిక్చర్ 'గాంధీ తాత చెట్టు'