ENGLISH

Chiranjeevi, Garikapati: చిరంజీవి ఇమేజ్ చూసి గరికపాటి అసూయపడ్డారా ?

07 October 2022-11:00 AM

హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి యేటా ‘అలయ్ బలయ్’ నిర్వహిస్తుంటారు. దసరా సమ్మేళనం- 2022లో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వేడుకగా జరిపారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన అలయ్ బలయ్‌కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి , ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మధ్య ఒక సన్నివేశం చోటు చేసుకుంది. చిరంజీవి పై గరికపాటి అసహనం వ్యక్తం చేశారు.

 

గరికపాటి మాట్లాడుతుండగా.. చిరంజీవితో అభిమానులు ఫొటో సెషన్‌ నిర్వహించారు. ఇది నచ్చని గరికపాటి ‘చిరంజీవి గారు ఫొటో సెషన్‌ ఆపితే మాట్లాడతా.. లేకపోతే కార్యక్రమం నుంచి వెళ్లిపోతా’ అంటూ కొంత గట్టిగానే చెప్పారు. అయితే వెంటనే చిరంజీవి చాలా పెద్దరికంగా స్పందించారు. ఆయనకి క్షమాపణలు కోరారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

దీనిపై మెగా బ్రదర్ నాగబాబు పరోక్షంగా స్పందించారు. ''ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే '' అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు మెగా అభిమానులు కూడా గరికపాటి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘అలయ్ బలయ్’ అనేది ఎంతో స్నేహపూర్వకంగా జరిగే కార్యక్రమం. అలాంటి కార్యక్రమంలో గరికపాటి లాంటి పెద్దవారికి అంత అసహనం పనికిరాదని, అయన అసహనంలో అర్ధం లేదని అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: గాడ్ ఫాద‌ర్ ఎంత‌కి అమ్మారు? ఎంత రావాలి?