కొత్త యేడాదిలో మరో వారం గడిచిపోయింది. ఈ వారం కూడా టాలీవుడ్‌లో ఎన్నో కొత్త సంగతులు, ఆసక్తి రేకెత్తించిన విశేషాలు చాలా జరిగాయి. వాటిని ఒక్కసారి రివైండ్ చేసుకుందాం.
పవన్ కల్యాణ్ అభిమానులకు ఈ వారం పండగే పండగ. ఎందుకంటే... తన కొత్త సినిమా 'పింక్' రీమేక్ ఈ వారమే మొదలైంది. హైదరాబాద్ శివార్లలో వేసిన ప్రత్యేక సెట్‌లో 'పింక్' శ్రీకారం చుట్టుకుంది. పవన్‌పై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. అయితే... ఇందుకు సంబంధించిన కొన్ని ఆన్ లొకేషన్ స్టిల్స్ బయటకు వచ్చాయి. ఓ వీడియో క్లిప్పింగ్ కూడా వైరల్ అయ్యింది. పవన్ వాకింగ్ స్టైల్ పోస్టర్లుగా వెలిశాయి. అయితే ఈ లీకేజీలపై పవన్ సీరియస్ అయ్యాడు. ఇక మీదట ఎలాంటి ఫుటేజీ, ఫొటోలూ బయటకు రాకూడదని చిత్రబృందాన్ని ఆదేశించాడు. అదే రోజున పవన్ అమరావతి రైతు పోరాటంలో పాల్లొనడం, పవన్‌ని పోలీసులు నిర్బంధించడం - టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారాయి. మరుసటి రోజు... పవన్ దిల్లీ వెళ్లి, బీజేపీ పెద్దల్ని కలిసి వచ్చాడు. జనసేన - బీజేపీల మధ్య మైత్రి కుదరడం ఈ వారానికే హైలెట్ అనుకోవాలి.
సరిలేరు నీకెవ్వరు - అల వైకుంఠపురములో బాక్సాఫీసు వార్.. ఈవారం మరింత రంజుగా కొనసాగింది. 200 కోట్ల పోస్టర్లు పోటీ పడి వేసుకోవడం, ఈ వసూళ్లన్నీ ఫేక్ అని - సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో మహేష్, బన్నీల గాలి తీసేసినట్టు అయ్యింది. సరిలేరు నీకెవ్వరు కొత్త సీన్లు ఈ వారంలోనే యాడ్ చేశారు.
వెంకీ కొత్త రీమేక్ 'అసురన్' ఈవారంలో క్లాప్ కొట్టుకుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చింది. వెంకీ 'రా' లుక్‌లో అదరగొట్టేశాడు. అయితే... ధనుష్ లుక్‌ని వెంకీ మక్కీకి మక్కీ కాపీ కొట్టినట్టు అనిపించింది. 'నారప్ప' టైటిల్ పై కూడా మిశ్రమ స్పందన వస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. వరుస ఫ్లాపుల తరవాత రవితేజ మరో సినిమా చేశాడు. అదే డిస్కోరాజా. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 24న విడుదలైంది. ఈ సినిమాతో అయినా రవితేజ ఫామ్‌లోకి వస్తాడనుకుంటే, నిరాశే ఎదురైంది. వరుసగా మరో ఫ్లాప్‌ని మూటగట్టుకోవాల్సివచ్చింది.
ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. తెలుగు నుంచి ఒక్క నటుడికీ, సాంకేతిక నిపుణుడికీ పద్మ పురస్కారం దక్కకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తోంది. మన రాష్ట్ర ప్రభుత్వాలు లాబియింగ్ జరపడంలో ఘోరంగా విఫలమయ్యాయని తెలుస్తోంది.
ALSO READ: కంగనా డ్రీమ్ ప్రాజెక్ట్ అదేనట.!