ENGLISH

పోలీసుల అదుపులో జానీ మాస్టర్

19 September 2024-12:58 PM

టాలీవుడ్ లో గతమూడు రోజులుగా హాట్ టాపిక్ గా మారిన జానీ మాస్టర్ వివాదం తెలిసిందే. జానీ దగ్గర అసిస్టెంట్ గా చేసే లేడీ కొరియోగ్రాఫర్ అతడిపై లైంగిక వేధింపుల కేసు పెట్టడం, నార్సింగ్ పోలీసులు కేస్ ఫైల్ చేసిన నేపథ్యంలో జానీ మూడు రోజులుగా పరారీలో ఉన్నాడు. నెల్లూరులో ఉన్నాడని సమాచారం రావటంతో  నెల్లూరు పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. కానీ దొరకలేదు. జానీ నెల్లూరులో ఒక లాయర్ పర్యవేక్షణలో ఉన్నాడని, కేసు నుంచి ఎలా బయట పడాలి ఏం చేయాలి అన్న చర్చలు చేస్తూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ముందస్తు బెయిల్ మంజూరు అయ్యాక పోలీసుల ముందు లొంగిపోతాడని అంతా భావించారు. 


నార్సింగ్ లో కేసు ఫైల్ అయ్యింది, ఫిలిం ఛాంబర్ మీటింగ్ పెట్టి జానీని ఎంక్వయిరీ కి పిలిచింది, డాన్సర్స్ అసోషియేషన్ జానీ ప్రసిడెంట్ పదవిని రద్దు చేశారు, జనసేన కూడా పార్టీ నుంచి దూరంగా పెట్టినట్లు ప్రకటించారు, మీడియాలో, సోషల్ మీడియాలో జానీకి వ్యతిరేకంగా చర్చలు ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి. కానీ జానీ మాస్టర్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మూడు రోజులుగా అజ్ఞాతనంలోనే ఉన్నాడు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. మొదట నెల్లూరులో ఉన్నాడని ప్రచారం జరిగింది. తరవాత బెంగళూరు నుంచి గోవా వెళ్లినట్టు ప్రచారం జరిగింది. మొత్తానికి హైదరాబాద్‌ SOT పోలీసులు జానీ మాస్టర్‏ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి గోవా నుంచి హైదారాబాద్ కు తీసుకువస్తున్నట్లు సమాచారం.  


నాలుగు బృందాలు జానీ కోసం గాలింపు చేపట్టి గురువారం ఉదయం గోవాలో అతడిని అదుపులోకి తీసుకున్నారు హైద్రాబాద్ పోలీసులు. ఇప్పటికే జానీ మాస్టర్ పై 'పోక్సో' కేసు నమోదు అయ్యింది. బెదిరించి అత్యాచారం చేయటమే కాకుండా చాల సార్లు గాయపరిచారని, జుట్టుపట్టుకుని ఈడ్చి కొట్టినట్లు ఎఫ్ఐఆర్ లో బాధితురాలు పేర్కొంది. జానీ భార్య కూడా మతం మార్చుకుని జానీని పెళ్లిచేసుకోమని వేధించినట్లు ఆమె పేర్కొంది. ఈ FIR ఆధారంగా జానీపై 376, 506, 323 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.