ENGLISH

పూనమ్ కి తమ్మారెడ్డి సలహా

18 September 2024-18:24 PM

టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది జానీ మాస్టర్ వివాదం. రీసెంట్ గా కేరళ ఇండస్ట్రీ లో జస్టీస్ హేమ కమిటీ నివేదిక తరువాత దేశం మొత్తం అన్ని ఇండస్ట్రీలకి ఇలాంటి కమిటీలు అవసరమని డిమాండ్లు వినిపించాయి. ఇలాంటి సమయంలో జానీ మాస్టర్ వివాదం వెలుగులోకి రావటంతో అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. ఇక లాభం లేదని ఫిలిం ఛాంబర్ తరపున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా, లైంగిక వేధింపులు లాంటివి ఎదురైనా వెంటనే వచ్చి కంప్లైన్ట్ చేయాలనీ, వాటిని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఒక ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపడతామని పేర్కొన్నారు. ఒక వేళ దైర్యంగా ముందుకు రాలేకపోతే కంప్లైన్ట్ బాక్స్ కూడా ఏర్పాటు చేశామని, పోస్ట్ లో కూడా రాసి కంప్లైన్ట్ చేయొచ్చని తెలిపారు. 


ఇవన్నీ చాలా మందికి భరోసా నిచ్చి ఉంటాయి. ఇక ముందు ఇలాంటివి వెంటనే పరిష్కార మవుతాయని, బాధితులకి న్యాయం జరుగుతుందని నమ్మకం ఏర్పడి ఉంటుంది. ఇదే టైం లో కొన్ని పాత కేసులు కూడా బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలోనే మరొకసారి త్రివిక్రమ్ పై ఆరోపణలు లేవనెత్తింది నటి పూనమ్ కౌర్. ఒకప్పుడు తాను త్రివిక్రమ్ కి వ్యతిరేకంగా 'మా' అసోషియేషన్ కి పిర్యాదు చేశానని కానీ ఎవరు రెస్పాండ్ అవలేదని, అప్పుడు యాక్షన్ తీసుకుని దోషులని శిక్షించి బాధితులకి న్యాయం చేస్తే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని 'X ' లో పోస్ట్ చేసింది. త్రివిక్రమ్ ని కూడా ప్రశ్నించండి అని పేర్కొంది. 

పూనమ్ పోస్ట్ పై ఫిలిం ఛాంబర్ తరపున తమ్మా రెడ్డి భరద్వాజ స్పందిస్తూ  'పూనమ్ కౌర్ ఎప్పుడు, ఎవరికి కంప్లైంట్ చేసిందో తెలియదని, అది తమ దృష్టికి రాలేదని స్పష్టం చేసారు. ఒక వేళ పూనమ్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడైనా ఫిల్మ్ ఛాంబర్ లో రాత పూర్వకంగా కంప్లైంట్ చేయొచ్చని, ఒక వేళ నేరుగా రాలేకపోతే ఫిల్మ్ ఛాంబర్ బయట ఉన్న బాక్స్ లో అయినా కంప్లైన్ట్ వేయొచ్చని తెలిపారు. అదీ కాదంటే  లైంగిక వేధింపుల సమస్యలని పరిష్కరించడానికి ఫిల్మ్ ఛాంబర్ స్పెషల్ గా ఒక సెల్ ని ఏర్పాటు చేసిందని, పూనమ్ కౌర్ అక్కడయినా కంప్లైన్ట్ చేయొచ్చని తమ్మారెడ్డి సలహా ఇచ్చారు.