ENGLISH

జాన్వీ కపూర్‌ అంత బరువు మోయగలదా?

11 March 2018-11:00 AM

శ్రీదేవి మరణం తర్వాత ఆమె జీవిత చరిత్రపై సినిమా రాబోతోందంటూ బాలీవుడ్‌లోనూ, టాలీవుడ్‌లోనూ విసృతంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా జరుగుతున్న ప్రచారం నిమిత్తం, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలో శ్రీదేవి బయోపిక్‌ రాబోతోందంటూ కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది.ఈ ప్రతిపాదనతో శ్రీదేవి భర్త, జాన్వీ కపూర్‌ తండ్రి బోనీ కపూర్‌ షాక్‌కి గురయ్యాడట. 

శ్రీదేవి హఠాన్మరణం వారి కుటుంబాన్ని తీరని శోక సంద్రంలోకి నెట్టివేసింది. ఇలాంటి స్థితిలో ఇలాంటి ప్రతిపాదనలేంటి.. అని బోనీకపూర్‌ వాపోతున్నారట. ఇప్పుడు మేం ఉన్న పరిస్థితుల్లో సినిమాలకు సంబంధించి కానీ, ఇతరత్రా విషయాల గురించి కానీ మాట్లాడేలా లేమనీ, కమిట్‌మెంట్‌ నిమిత్తం, ముందుగా ఒప్పుకున్న 'ధడక్‌' సినిమా షూటింగ్‌కి జాన్వీ కపూర్‌ వెళ్లాల్సి వస్తుందనీ ఆయన అన్నారు. అయినా శ్రీదేవి మహానటి. అలాంటిది జాన్వీతో శ్రీదేవి బయోపిక్‌ ఏంటి? ఉన్న పలంగా సెంటిమెంట్‌ని క్యాష్‌ చేసుకోవాలనే ఇలాంటి ప్రతిపాదనలతో కూడిన గాసిప్స్‌ క్రియేట్‌ చేయడం తప్ప అని సినీ ప్రముఖులు, శ్రీదేవి అభిమానులు అంటున్నారు. 

అవును నిజమే, అంతటి మహానటి జీవిత చరిత్రను జాన్వీతో తెరకెక్కించడం ఏంటి? గాసిప్‌ పుట్టించడానికైనా అర్ధం ఉండాలి కదా. జాన్వీ ఇంకా హీరోయిన్‌గా ఓనమాలు దిద్దుతున్న అమ్మాయి. అలాంటిది ఎంత ఆ మహానటికి కూతురైతే మాత్రం, తెరపై నటించి, మెప్పించే సత్తా ఉందో లేదో ప్రూవ్‌ చేసుకోవాలి కదా. ముందుగా నటిగా తనని తాను ప్రూవ్‌ చేసుకున్నాకే ఇలాంటి పెద్ద ఆలోచనలు చేసేది. ప్రస్తుతం జాన్వీ 'ధడక్‌' చిత్రంతో హీరోయిన్‌గా తెరంగ్రేటం చేస్తోన్న సంగతి తెలిసిందే. 

ఈ సినిమా కోసమే, తల్లి మరణం నుండి ఇంకా తేరుకోకపోయినా, ఆ బాధని గుండెల్లోనే నింపుకుని, ముఖానికి మేకప్‌ వేసుకోవాల్సి వచ్చింది జాన్వీకి.

ALSO READ: దయచేసి అలాంటి కథలు చెప్పకండి: రశ్మి