ENGLISH

జితేందర్ రెడ్డి మూవీ రివ్యూ & రేటింగ్‌

09 November 2024-14:21 PM

చిత్రం: జితేందర్ రెడ్డి  
దర్శకత్వం:  విరించి వర్మ
కథ - రచన: విరించి వర్మ

నటీనటులు:  రాకేష్ వర్రే, రియా సుమన్, వైశాలి రాజ్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ తదితరులు

నిర్మాతలు: ముదుగంటి రవీందర్ రెడ్డి, ఉమ రవీందర్.

సంగీతం: గోపి సుందర్

సినిమాటోగ్రఫీ: వీఎస్ జ్ఞాన శేఖర్

ఎడిటర్:  రామకృష్ణ అర్రం

విడుదల తేదీ: 7 నవంబర్ 2024

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.75/5

ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ మధ్య తెలుగులో కూడా బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. అలా వచ్చిందే జితేందర్ రెడ్డి బయోపిక్. ఇప్పటికే తెలుగు తెరపై సినీ, క్రీడాకారులు, రాజకీయ నాయకుల బయోపిక్స్ చాలా తెరకెక్కాయి . ఇపుడు నక్సలైట్ల చేతిలో కన్నుమూసిన ఏబీవీపీ కార్యకర్త జితేందర్ రెడ్డి కథ తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. విరించి వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీలో జితేందర్ రెడ్డి గా రాకేష్ వర్రే నటించారు. ఇప్పటికే రాకేష్ వర్రే పలు సినిమాల్లో సహాయక పాత్రలు చేసాడు. హీరోగా 'ఎవ్వరికీ చెప్పొద్దు'అనే సినిమాతో పరవాలేదని పించుకున్నాడు. మళ్ళీ ఐదేళ్ల తరవాత హీరోగా మరో ప్రయత్నం చేసాడు. జితేందర్‌ రెడ్డి సినిమా ఎలా ఉంది?ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? రాకేష్ వర్రే  హీరోగా సక్సెస్ అయ్యాడా? లేదా?అన్నది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

జగిత్యాలలో సంపన్న కుటుంబంలో పుట్టిన జితేందర్ రెడ్డి (రాకేష్ వర్రే) చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన కారణంగా ప్రజల కోసమే ఈ బ్రతుకు అన్న ఆలోచనతో పెరుగుతాడు. జాతీయ భావాలున్న గోపన్న (సుబ్బరాజు),రామన్నను ఆదర్శంగా తీసుకొని వామపక్ష భావజాలం ఉన్న వారితో పోరాడుతూ ఉంటాడు. కాలేజీలో వామపక్ష విద్యార్థి సంఘాలతో గొడవపడి నక్సలైట్ ఉద్యమానికి ఎదురు నిలబడుతాడు. తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. కానీ అప్పటివరకు నక్సలైట్ ఉద్యమానికి ఎదురు నిలబడ్డ కారణంగా జితేందర్ రెడ్డిని మట్టుబెడతారు. చిన్నతనంలో జితేందర్ రెడ్డి ఆలోచన విధానాన్ని మార్చి వేసిన సంఘటన ఏంటి ?లెఫ్ట్ పార్టీ స్టూడెంట్ యూనియన్లపై జితేందర్ రెడ్డి చేసిన పోరాటం?నక్సలైట్లను,స్థానిక ఎమ్మెల్యేను ఎదిరించి ఎమ్మెల్యే టికెట్ సాధించిన  విధానం?జితేందర్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఎలా సాగింది?ఎమ్మెల్యే టికెట్ తర్వాత ఎదురైన పరిణామాలు? నక్సలైట్లపై జితేందర్ రెడ్డి ప్రతీకారం తీర్చుకున్న విధానం?జితేందర్ రెడ్డి జీవిత ముగింపు ?తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: 

కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన దివంగత ఏబీవీపీ నాయకుడు జితేందర్‌ రెడ్డి జీవిత కథతో రూపొందిన కథ ఇది. ముగింపు అందరికీ తెలిసిందే. 80లలో జగిత్యాలలో నక్సలైట్లకు, ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ నేతలకు మధ్య జరిగిన పోరాటంలో జితేందర్‌ రెడ్డి కీలక పాత్ర పోషించి, నక్సల్స్ దాడిలో మరణించారు. 72బుల్లెట్ల ఆయన శరీరాన్ని తూట్లు చేసాయి. వామపక్ష ఉద్యమాల హవా కొనసాగుతున్న రోజుల్లో వారికి వ్యతిరేకంగా జితేందర్‌రెడ్డి ఎందుకు? ఎలా? ఎవరి అండతో పోరాటం చేశాడు అన్నది ఈ సినిమా లో చూపించారు. జితేందర్‌ రెడ్డి కథ అందరికీ తెలిసిందే. జగిత్యాల వాసులకి ఇంకా ఎక్కువ తెలుసు. జగిత్యాలలో జితేందర్ రెడ్డి గూర్చి ఇప్పటికీ కధలు కధలుగా చెప్పుకుంటారు. తెలియని విషయాలను కూడా ఈ సినిమాలో ప్రస్తావించారు. కారణం కథ అందించింది జితేందర్ రెడ్డి సోదరుడు.

వాస్తవాలు పక్కన పెడితే సినిమాటిక్‌ లిబర్టీతో దర్శకుడు తను రాసుకున్న కథను రాసుకున్నట్లు తెరకెక్కించటంలో హండ్రడ్ పర్శంట్ సక్సెస్ అయ్యాడు. జితేందర్‌ రెడ్డి చిన్నప్పటి నుంచి మరణం దాకా ముఖ్యమైన విషయాలని ప్రేక్షకుల ముందు ఉంచాడు. కొన్ని  సీన్స్  ఓవర్ డ్రమటైజ్‌ గా అనిపించినా సినిమాకి తప్పదు. సినిమాలో ఫస్ట్ హాఫ్ లో జితేందర్‌ రెడ్డి బాల్యం,స్టూడెంట్‌ లీడర్‌గా ఎదిగిన తీరు, నక్సల్‌కి ఎందుకు,ఎలా టార్గెట్‌ అయ్యారన్నది చూపించారు. సెకండాఫ్‌ నుంచి సినిమా పై ఆడియన్స్ లో ఆసక్తి పెరుగుతుంది. ఎన్నికల ప్రచారం,క్లైమాక్స్‌ అన్నీ సినిమాటిక్ ఫీల్ తీసుకొచ్చాయి.  కొన్ని సీన్లు చాలా ఎమోషనల్‌గా రాసి,భావోద్వేగాన్ని పండించారు. ఇందులో  గోపన్న,రామన్న హత్య ఎపిసోడ్,గట్టయ్య క్యారెక్టర్ ద్వారా కథ చెప్పడం బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీతలా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ లో దాన్ని అధిగమించి స్పీడ్ పెంచారు. దర్శకుడిగా విరించి వర్మ ఆకట్టుకొన్నాడు.

నటీ నటులు:

జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ బాగానే నటించారు. ఆ పాత్ర తీరు తెన్నులని,మ్యానరిజాన్ని బాగా వర్కౌట్ చేసారు. జితేందర్ రెడ్డిగా హీరో ఆకట్టుకున్నారు. ఈ సినిమా తరవాత రాకేష్ వర్రే  హీరోగా మరిన్ని సినిమాలు చేసే ఛాన్స్ ఉంది. ఓ స్టూడెంట్ దశ నుంచి, రాను రాను వ్యవహార శైలిలో వచ్చే మార్పులు,బాడీ చేంజెస్, అన్నీ కుదిరాయి. అంతే కాదు ఈ విషయంలో చాలా కేర్ తీసుకున్నారని పించింది. ఈ సినిమాకోసం రాకేష్ ఎంత కష్టపడ్డాడో అర్థం అవుతుంది. ఒక నటుడిగా, హీరోగా రాకేష్ కి మంచి గుర్తింపు తీసుకొస్తుంది జితేందర్ రెడ్డి. సెకండాఫ్‌లో జితేందర్ రెడ్డిగా ఆ పాత్రలో  పరకాయ ప్రవేశం చేసారు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు రాకేష్ పెర్ఫార్మెన్స్ సూపర్. గోపన్నగా సుబ్బరాజుకి మంచి పాత్ర పడింది. ఒక అర్థవంతమైన పాత్రలో చక్కని నటనతో ఆకట్టుకున్నాడు. గట్టయ్యగా రవి ప్రకాశ్ సినిమాకు హైలెట్‌. చాన్నాళ్ల తర్వాత సినిమా మొత్తం ట్రావెల్ చేసే క్యారెక్టర్ దొరికింది రవి ప్రకాష్ కి. హీరోయిన్స్ వైశాలి రాజ్,లాయర్ గా రియా సుమన్,తమ పాత్రల పరిధి మేరకు నటించారు. వీరికి నటనకి పెద్దగా ఆస్కారం  లేదు. ఛత్రపతి శేఖర్,బిందు చంద్రమౌళి తదితరుల నటన పర్వాలేదు.

టెక్నికల్ :

దర్శకుడు విరించి వర్మ ఇప్పటివరకు లవ్ స్టోరీస్ తెరకెక్కించాడు. మొదటి సారి తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి ఓ బయోపిక్ ను తీసాడు. ఈ విషయం లో కొంతవరకు సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. లాజికల్ గా,సెన్సిబుల్ గా ఒక బయోపిక్ తెరకెక్కించి ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలిగాడు. కథ ఎక్కడా సినిమాటిక్ గా అనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. స్క్రీన్ ప్లే లో కొంచెం తడబడ్డాడు. దర్శకుడిగా బాగానే ఆకట్టుకున్నా కథకుడిగా కొంచెం గాడి తప్పాడు. 80,90 ల నేపధ్యాన్ని అద్భుతంగా తెరమీద చూపించ గలిగాడు. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సూపర్. మ్యూజిక్,ఆర్ట్ వర్క్,సినిమాటోగ్రఫి జితేందర్ రెడ్డి మూవీకి  కీలకంగా మారాయి. 80 ల నాటి వాతావరణాన్ని తెరమీదకు తీసుకు రావడంలో ఎంత కృషి చేసారో ఆర్ట్ డిపార్ట్ మెంట్ కష్టం కనిపిస్తోంది. క్యాస్టూమ్స్ ,ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజ్ విషయంలో కూడా తీసుకున్న జాగ్రత్తలు తెర పై  తెలుస్తూనే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది, కొన్ని సీన్స్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ద్వారా ఎలివేట్ చేసిన విధానం బాగుంది. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. ముదుగంటి రవీందర్ రెడ్డి,ఉమ రవీందర్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

రాకేష్ వర్రే  
దర్శకుడు 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
ఆర్ట్ డిపార్ట్ మెంట్

 

మైనస్ పాయింట్స్

కథ,కథనం 
పాటలు 
స్లో నేరేషన్

 

ఫైనల్ వర్దిక్ట్ : నిజాయితీగా చేసిన ప్రయత్నం 'జితేందర్ రెడ్డి'