మెగా కాంపౌండ్ లో చెలరేగిన వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా? మాఫీ అవలేదా? అదే అనిపిస్తోంది తాజాగా వరుణ్ తేజ్ మాటల్ని చూస్తే. వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా సినిమాతో నవంబర్ 14 న థియేటర్స్ లో సందడి చేయనున్నాడు. ఈ సందర్భంగా మట్కా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే మళ్ళీ మెగా వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టు అయ్యింది. ఆదివారం వైజాగ్ లో మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ తన ఎదుగుదలకి కారణం పెదనాన్న చిరంజీవి, అన్నయ్య రామ్ చరణ్, బాబాయ్ పవన్ కళ్యాణ్ అంటూ వారిని కీర్తించాడు. అంతే కాదు ఎవరైనా సరే, ఎవరి వల్ల ఎదిగామో, వాళ్లని మర్చిపోకూడదు, అలా మర్చిపోతే, ఎన్ని గొప్ప విజయాలు సాధించినా వేస్ట్ అంటూ పేర్కొన్నాడు.
తన అన్నయ్య, పెద్దనాన్న, బాబాయ్ లని ప్రతివేదిక పైనా తల్చుకుంటానని, అదేం తనకి తప్పు కాదని, దాని ఎవరు తప్పు పట్టినా తనకేం నష్టం లేదని స్పష్టం చేసాడు. లైఫ్ లో నువ్వు గొప్పోడివి అవ్వొచ్చు అవ్వకపోవచ్చు. కానీ నీ ప్రయాణం ఎందుకు, ఎక్కడ మొదలుపెట్టావు, నీ వెనకుండి సపోర్ట్ ఎవరు ఇచ్చారు అని నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ ఎందుకు పనికిరాదు. పెదనాన్న, బాబాయ్, నాన్న, అన్నయ్య వాళ్ళు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. వాళ్ళు నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు అని వరుణ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వరుణ్ తేజ్ ఇప్పటివరకు కామ్ గా తన పని తాను చేసుకుంటూ పోతాడు. వివాదాల్లో తలదూర్చడు. కానీ ఈ సారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏపీ ఎలక్షన్ ముందు అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేయటం కోసం నంధ్యాల వెళ్ళాడు. అప్పుడే ఈ వివాదం పెద్దది అయ్యింది. ఈ మధ్య కొంత సర్దుకుంది అన్నట్టు వినిపించింది. పుష్ప 2 ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం పవన్ కళ్యాణ్ ని చీఫ్ గెస్ట్ గా పిలుస్తారని ప్రచారం జరిగింది. అది కూడా స్వయంగా బన్నీ కలిసి ఇన్వైట్ చేస్తారని అనుకున్నారు. కానీ ఇంతలోనే వరుణ్ వ్యాఖ్యలతో మళ్ళీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. బన్నీ డిసెంబర్ 5 న పుష్ప 2 తో వస్తున్నాడు. ఈ టైం లో ఇలాంటి వివాదం రావటం కొంచెం డ్యామేజ్. ఈ ప్రభావం పుష్ప 2 పై పడే అవకాశముంది.