ENGLISH

రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో చందమామ

06 June 2017-17:02 PM

అప్పుడెప్పుడో తేజ డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా 'లక్ష్మీ కళ్యాణం'తో తెలుగు ప్రేక్షకులకు హాయ్‌ చెప్పిన 'చందమామ' కాజల్‌ అగర్వాల్‌ తొలి సినిమాతోనే విజయం అందుకుంది. ఆ తర్వాత కృష్ణవంశీ సినిమా 'చందమామ'తో అందాల చందమామగా పేరు తెచ్చుకుంది. అప్పట్నుంచీ ఈ చందమామకి ఎదురే లేదు. స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. వరుస విజయాలతో స్టార్‌ హీరోల అందరి సరసన హీరోయిన్‌గా పలు అవకాశాలు దక్కించుకుంది. నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా పాపులర్‌ అయ్యింది. గత పదేళ్లుగా తన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూ చాలా దగ్గరయిపోయింది బ్యూటీ కాజల్‌. కాజల్‌ కెరీర్‌ అయిపోయింది అనుకున్న టైంలో ఎన్టీఆర్‌తో 'జనతా గ్యారేజ్‌' సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించి వారెవ్వా అనిపించుకుంది. ఆ వెంటనే మెగాస్టార్‌తో 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాలో నటించి, మెగా హీరోయిన్‌ బిరుదు కూడా సార్ధకం చేసుకుంది చందమామ బ్యూటీ కాజల్‌. ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తేజ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో రానాకి జంటగా కాజల్‌ నటిస్తోంది. తర్వాత కళ్యాణ్‌రామ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. 'ఎమ్యెల్యే' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌కి జంటగా కాజల్‌ నటిస్తోంది. ఉపేంద్ర మాధవ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కాజల్‌ పాత్ర కొత్తగా ఉంటుందట. గ్లామరస్‌గా కనిపిస్తూనే ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఈ సినిమాలో నటించనుందట కాజల్‌ అగర్వాల్‌.

ALSO READ: శ్రీదేవికి కొత్త కష్టం వచ్చింది