ENGLISH

తెలుగు వాకిట‌.. మ‌రో పెళ్లిపాట‌

19 June 2021-12:00 PM

తెలుగు సినీ సాహిత్యంలో పెళ్లి పాట‌ల‌కు ప్ర‌ముఖ‌మైన స్థానం ఉంది. పెళ్లి పాట అన‌గానే... ప్రేక్ష‌కులు `ఓన్‌` చేసుకుంటారు. త‌మ పెళ్లి సీడీల‌లో చేర‌డానికి మ‌రో పాట వ‌చ్చింద‌నుకుంటారు. అయితే.. ప్రతీ పాట‌కూ ఆ స్థానం ద‌క్క‌దు. కొన్ని పాట‌లే - తెలుగు సంప్ర‌దాయంలో క‌లిసిపోతుంటాయి. ఆ జాబితాలో చేర‌డానికి మ‌రో పాట వ‌చ్చింది. అదే.. `క‌ల్యాణం క‌మ‌నీయం.. ఒక‌ట‌య్యే వేళ వైభోగం` అంటూ సాగే పాట‌. `పుష్ష‌క విమానం` కోసం సిద్ శ్రీ‌రామ్‌, మంగ్లీ ఆల‌పించారు. ఆనంద్ దేవ‌ర‌కొండ‌, గీత్ సైనీ జంట‌గా న‌టించిన చిత్ర‌మిది. దామోద‌ర ద‌ర్శ‌కుడు.

 

ఈ చిత్రంలోని ఓ గీతాన్ని స‌మంత చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఇదో పెళ్లి పాట‌. కాశ‌ర్ల శ్యామ్ ర‌చించారు. రామ్ మిరియాల సంగీతం అందించారు. మంగ్లీ సాకీతో.. హోరుగా మొద‌లైంది. ఆ త‌ర‌వాత చ‌ర‌ణాల్ని సిద్ శ్రీ‌రామ్ త‌న‌దైన శైలిలో ఆల‌పించారు. `ఈ అగ్ని మీకు సాక్షిగా, ఏడు జ‌న్మ‌ల బంధంగా...మీ అనుబంధ‌మే బ‌ల‌ప‌డ‌గా, ఇక తొమ్మిది నిండితే నెల‌, నెమ్మ నెమ్మ‌దిగా తీరే మీ క‌ల‌, ప‌ది అంకెల్లో సంసార‌మిలా, ప‌దిలంగా..` అంటూ వివాహ బంధాన్ని అంకెల్లో వ‌ర్ణించిన తీరు.. న‌చ్చుతుంది.

 

ఈ ఆల్బ‌మ్ లో భాగంగా విడుద‌లైన తొలి పాట `సిల‌కా` కూడా శ్రోత‌ల‌కు న‌చ్చింది. ఇప్పుడు ఇది రెండో పాట‌. సంగీత‌ప‌రంగా మంచి మార్కులు తెచ్చుకుంటే, సినిమా స‌గం హిట్ట‌యిన‌ట్టే లెక్క‌. సో.. `పుష్ష‌క విమానం`కీ హిట్ క‌ళ వ‌చ్చేసిన‌ట్టే.

ALSO READ: సాయి ప‌ల్ల‌విని వ‌ద‌ల‌డా?