ENGLISH

కంగన సంపాదన ఆ స్థాయిలో వుందా?

17 September 2020-12:00 PM

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన కంగనా రనౌత్‌ సంపాదన ఎంత.? అన్న చర్చ జరుగుతోందిప్పుడు. స్టార్‌ హీరోయిన్‌గా కంగనకి రెమ్యునరేషన్‌ గట్టిగానే దక్కుతున్నా, ఎడా పెడా ఆమె సినిమాలు ఏమీ చెసెయ్యదు. పైగా, ప్రతి సినిమా విషయంలోనూ ఏదో ఒక వివాదం తప్పదు. నిర్మాతలతోనూ, దర్శకులతోనూ కంగనకి వివాదాలు సర్వసాధారణం. ఈ నేపథ్యంలో చాలా తక్కుమంది నిర్మాతలు మాత్రమే ఆమెతో సినిమాలు చేసేందుకు ముందుకొస్తుంటారు.

 

అయితే, ఆ వివాదాలే ఆమెకు నటిగా మరింత ఇమేజ్‌ని తెచ్చిపెడుతున్న దరిమిలా, ఆమెకి తెరవెనుకాల కూడా బాగానే గిట్టుబాటు అవుతోందట. ‘కంగన, రియల్‌ లైఫ్‌లో కూడా నటించేస్తుంటుంది. అందుకు తగ్గ పేమెంట్‌ ఆమెకు అందుతోంది..’ అంటూ ఈ మధ్య పొలిటికల్‌ లీడర్స్‌ కూడా కంగనపై సెటైర్లు వేస్తున్నారు. ఓ రాజకీయ పార్టీకి మద్దతుగా, ఇంకో రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కంగన ఈ మధ్య నినదిస్తున్న విషయం విదితమే. తద్వారా ఆమెకు బాగానే ‘గిట్టుబాటు’ అవుతోందనీ, సినిమాలతో వచ్చే రెమ్యునరేషన్‌ తరహాలోనే ఈ రెమ్యునరేషన్‌ కూడా వుంటోందని అంటున్నారు.

 

‘కంగన ముంబైలో అతి ఖరీదైన కార్యాలయాన్ని సొంతం చేసుకోగలిగిందంటే, అది కేవలం సినిమాల ద్వారా సంపాదించింది మాత్రమే కాదు. ఇతరత్రా వ్యవహారాలు ఆమెకు చాలానే వున్నాయి..’ అనే వాదన తెరపైకి వస్తోంది. ఇందులో నిజమెంతో కంగన పెదవి విప్పితేనే గానీ తెలియదు.

ALSO READ: Kangana Ranaut Latest Photoshoot