ఒకప్పుడు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా ఎదగటం కష్టంగా ఉండేది. ఎంట్రీ ఇవ్వటానికే నానా తిప్పలు పడినవాళ్లు ఉన్నారు. తరవాత తరవాత కొంత మారింది. టాలెంట్ ఎవడి అబ్బ సొత్తు కాదు అని కొందరు నిరూపించుకున్నారు. చిరంజీవి, రవి తేజ, నాని, విజయ్ దేవర కొండ, లాంటి వాళ్ళు హార్డ్ వర్క్, టాలెంట్ తో స్టార్ ఇమేజ్ తెచ్చుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో తరచుగా నేపోటిజమ్ పై విమర్శలు వస్తూనే ఉంటాయి. కానీ మిగతా ఇండస్ట్రీలది కూడా అదే దారి. ఇక్కడ కూడా నేపోటిజం ఉందని, తాము బాధితులమని కొందరు తెగేసి చెప్పినవారు ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ రావటంతో బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకుని స్టార్స్ అయిపోతున్నారు.
అయినా కొందరికి ఇంకా కష్టాలు తప్పలేదు. వారిలో కిరణ్ అబ్బవరం ఒకడు. 'రాజా వారు రాణీ గారు ' సినిమాతో టాలీవుడ్ కి హీరో గా పరిచయం అయిన కిరణ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని తెలుగు ఆడియన్స్ ని మెప్పించ గలిగాడు. కిరణ్ చేసిన సినిమాలకి కమర్షియల్ లెక్కలు ఉండవు. సాదా సీదా కథలే కానీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేలా ఉంటాయి. హీరోయిజానికి ఆమడ దూరంలో ఉండి సింపుల్ గా తన కథలకి సరిపడేలా ఉంటాడు. కిరణ్ ప్రస్తుతం 'క' అనే మూవీతో అక్టోబర్ 31 న థియేటర్స్ లో సందడి చేయనున్నాడు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో కిరణ్ మాటలు పలువురిని ఆలోచింప జేసేవిగా ఉన్నాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వాడు ఎదిగితే చూడలేని వాళ్ళు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారా? అని ప్రశ్నలు తలెత్తేలా చేసాయి.
‘క’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ తాను ఎదుర్కొన్న అవమానాల్ని, కష్ఠాలని ఏకరువుపెట్టారు. 'క' అనే పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేయగానే 'పవన్ కల్యాణ్‌కే సాధ్యం కాలేదు. నువ్వు పాన్ ఇండియా సినిమా చేస్తావా' అంటూ అవమానించారని, కొందరు ఇంకొంచెం ముందుకు వెళ్లి సినిమాల్లో నేరుగా తనపై ట్రోల్స్ వేస్తున్నారని, ఆవేదన చెందాడు. ఈ హీరో వెనుక ఓ పొలిటీషన్ ఉన్నాడని వచ్చిన రూమర్లు, అన్నింటిపై కిరణ్ డైరెక్ట్ గా స్పందించాడు.
నాతో మీకున్న ప్రాబ్లం ఏమిటి? కిరణ్ అనేవాడు ఎదగ కూడదా అని, ఇలా అడిగినందుకు నా పై మళ్ళీ పగ పడతారని తెలిసినా అడుగుతున్నా అని దైర్యంగా ప్రశ్నించాడు. 'నేను చేసిన కొన్ని సినిమాలు నచ్చాయ్.. కొన్ని సినిమాలు పోయాయ్.. అవన్నీ పక్కన పెడితే నాతో మీకు ఏంటి ప్రాబ్లమ్. అవును షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చాను, నా పని నేను చేసుకుంటూ పోతున్నాను నా వలన మీకేంటి ఇబ్బంది? నా పై మీ సినిమాలో ట్రోల్స్ చేయాల్సిన రైట్ మీకెక్కడిది, మిమ్మల్ని ఏ రోజు ఏ సాయం అడగలేదు అయినా నాపై మీకు ఎందుకు ద్వేషం అని ఆవేదన చెందాడు. కిరణ్ బాధని అర్థం చేసుకున్న నెటిజన్స్ తనకి సపోర్ట్ గా నిలుస్తున్నారు.