జయంత్ సి పరాన్జీ పేరు చెబితే స్టార్ డైరెక్టర్ గుర్తుకొస్తాడు. అగ్రహీరోలతో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన జయంత్ సి పరాన్జీ, కొత్త నటుడు గంటా రవితో 'జయదేవ్' సినిమా రూపొందించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మహేష్‌బాబుతో ఓ సినిమా తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు జయంత్ చెప్పారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో 'టక్కరిదొంగ' సినిమా వచ్చింది. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, ఈ తరానికి కౌబాయ్ సినిమాని చూపించడంలో సఫలమయ్యారు. నాటి తరానికి సూపర్ స్టార్ కృష్ణ కౌబోయ్ అయితే, నేటి తరానికి మహేష్ బాబే కౌబాయ్ అనేంతగా ఆ సినిమాలో కౌబోయ్ క్యారెక్టర్‌ని డిజైన్ చేశాడు డైరెక్టర్ పరాన్జీ. ఇదే సినిమాలో మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా అతిథి పాత్రలో కనిపిస్తారు. ఎప్పటికైనా మహేష్‌తో సెన్సేషనల్ హిట్ కొట్టాలన్నది జయంత్ డ్రీమ్ అట. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, పవన్‌కళ్యాణ్, బాలకృష్ణ, ప్రభాస్ తదితరులతోనూ జయంత్ సినిమాలు చేశారు. 'అల్లరిపిడుగు', 'తీన్‌మార్' చిత్రాల పరాజయంతోనే గ్యాప్ వచ్చిందంటూ పరాజయాల్ని ధైర్యంగా చెప్పుకోవడంద్వారా జయంత్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. 'జయదేవ్' సినిమా తనకు మంచి విజయాన్ని అందిస్తుందనీ, హీరోగా గంటా రవికి తొలి సినిమాతో బిగ్ సక్సెస్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు జయంత్.
ALSO READ: రానా కాజల్ కలిసి ఫినిష్ చేసేశారు