ENGLISH

తిరుప‌తిలో మోహ‌న్‌బాబు ఫిల్మ్ అకాడ‌మీ

08 February 2022-10:18 AM

తిరుప‌తిలో విద్యాసంస్థ‌లు ప్రారంభించి - యూనివ‌ర్సిటీ స్థాయికి తీసెకెళ్లారు మోహ‌న్ బాబు. స‌గం రోజులు హైద‌రాబాద్‌లో ఉంటే, మిగిలిన స‌గం రోజులు తిరుప‌తిలోనే ఉంటూ విద్యా సంస్థ‌ల కార్య‌కలాపాల్ని ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. ఇప్పుడు మ‌రో అడుగు ముందుకు వేస్తూ.. తిరుప‌తిలో ఫిల్మ్ అకాడ‌మి ఏర్పాటు చేయ‌బోతున్నారు. మోహ‌న్ బాబు ఫిల్మ్ అకాడ‌మీ పేరుతో ఓ శిక్ష‌ణాల‌యం ప్రారంభించి, అందులో న‌ట‌న‌, ద‌ర్శ‌క‌త్వం, స్క్రీన్ రైటింగ్‌.. ఇలా 24 విభాగాల‌లో శిక్ష‌ణ ఇవ్వ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ అకాడ‌మీ గురించి మోహ‌న్‌బాబు అధికారికంగా ప్ర‌క‌టిస్తారు.

 

``మా నాన్న‌గారి పేరిట తిరుప‌తిలో ఫిల్మ్ అకాడ‌మీ ఏర్పాటు చేస్తున్నాం. దీని వ‌ల్ల స్థానికుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు వ‌స్తాయ‌ని న‌మ్ముతున్నాం. ప్ర‌తిభావంతులైన సాంకేతిక నిపుణుల్ని ప‌రిశ్ర‌మ‌కు అందివ్వ‌డ‌మే ఈ ఫిల్మ్ అకాడ‌మీ ల‌క్ష్యం`` అని మంచు విష్ణు తెలిపారు. హైద‌రాబాద్ కేంద్రంగా ఫిల్మ్ కోచింగ్ సెంట‌ర్లు చాలా ఉన్నాయి గానీ, ఆంధ్రాలో... ఆ అవ‌కాశాలు లేవు. తిరుప‌తిలో అకాడ‌మీ ఏర్పాటు చేస్తే... ఏపీ వాళ్ల‌కు వెసులుబాటుగా ఉంటుంది.

ALSO READ: ట్రైలర్: మాస్ మహారాజా మార్క్ 'ఖిలాడీ'