ENGLISH

మోహన్ లాల్ దర్శకత్వంలో మెగాస్టార్ ?

26 December 2024-16:45 PM

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పటికి 400 సినిమాల్లో నటించారు. రీసెంట్ గా మెగా ఫోన్ పట్టి 'బరోజ్ 3డీ' అనే పాన్ ఇండియా మూవీ తీశారు. దర్శకుడిగా కంటే హీరో గానే ఫుల్ మార్క్స్ వేయించుకున్నారు మోహన్ లాల్. మలయాళం లో ఎంత సూపర్ స్టార్ అయినా తెలుగులో వచ్చిన ఏ చిన్న అవకాసాన్ని వదులుకోలేదు. టాలీవుడ్ తో ప్రత్యేక అనుబంధం ఉంది మోహన్ లాల్ కి. ముఖ్యంగా మెగాస్టార్  చిరంజీవి, మోహన్ లాల్ మంచి జాన్ జిగురు దోస్తులు. అన్ని భాషల్లోనూ న‌టుడిగా, నిర్మాత‌గా తన‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్న మోహన్ లాల్ ఇప్పుడు చిరుని డైరక్ట్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

బరోజ్ తో మెగా ఫోన్ పట్టిన మోహన్ లాల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవితో కలిసి వర్క్ చేయాలి అనుకుంటున్నట్లు తెలిపారు. అది కూడా హీరోలుగా కలిసి వర్క్ చేయటం కాదు మోహన్ లాల్ దర్శకుడిగా, చిరు హీరో గా సినిమా తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు బయట పెట్టారు. తెలుగు హీరోల్లో ఎవర్ని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు అని ప్రశ్న ఎదురవగా టక్కున చిరంజీవి అని చెప్పారు మోహన్ లాల్. వీరిద్దరూ మంచి స్నేహితులని, హైద‌రాబాద్ కి ఎప్పుడు వచ్చినా ఇద్ద‌రు ఒకర్ని ఒకరు కలవకుండా ఉండరని తెలిపారు. అలాంటిది తెలుగులో సినిమా తీయాలనుకుంటే చిరుకి కాక ఇంకెవరికి కాల్ చేస్తానని ఎదురు ప్రశ్నించారు మోహన్ లాల్.

ప్రజంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న చిరు వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నారు. పైగా సీనియర్లు కంటే జూనియర్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు చిరు. ఈ క్రమంలో మోహన్ లాల్ కోరిక తీరుతుందేమో చూడాలి. ఇప్పటికే మోహన్ లాల్ నటించిన 'లూసిఫర్' మూవీని తెలుగులో చిరు గాడ్ ఫాదర్ గా తెరకెక్కించారు.