ENGLISH

మల్టీస్టారర్స్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌

04 October 2017-14:59 PM

టాలీవుడ్‌కి సంబంధించినంత వరకూ మల్టీస్టారర్‌ మూవీలంటే దర్శక నిర్మాతలకి ముందుగా గుర్తొచ్చే పేరు నాగార్జున. కొత్త కొత్త దర్శకులు ఆ రకంగా నాగార్జున ద్వారానే పరిచయమవుతూ ఉంటారు. హీరోగానే కాకుండా, నిర్మాతగానూ కూడా నాగార్జున రిస్క్‌ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన నిర్మాణంలో అలాగే కొత్త కొత్త కథలు కూడా తెరకెక్కాయి. గతంలో శ్రీకాంత్‌తో ఓ మల్టీ స్టారర్‌ సినిమా చేశాడు. ఆయన కొడుకుతో 'నిర్మలా కాన్వెంట్‌' అనే సినిమాని నిర్మించాడు. మోహన్‌బాబుతో 'అధిపతి' సినిమాలోనూ, ఆయన కుమారుడు విష్ణుతో 'కృష్ణార్జున' సినిమాలోనూ నటించాడు. అలాగే సుమంత్‌తో ఓ సినిమాలో నటించాడు. మొన్నటికి మొన్న తమిళ హీరో కార్తితో 'ఊపిరి' సినిమాలో నటించి మెప్పించాడు. ఇలా గతం నుండీ చూసుకుంటే, మల్టీ స్టారర్‌ సినిమాలకు నాగార్జున పెట్టింది పేరు. తాజాగా నేచురల్‌ స్టార్‌ నానితో నాగార్జున ఓ సినిమా చేయబోతున్నాడు. 'భలే మంచి రోజు' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ కొత్తగా ఉండడంతో ఈ సినిమాకి నాగ్‌ ఓకే చెప్పారట. ఇద్దరి క్యారెక్టర్స్‌ చాలా చాలా కొత్తగా ఉంటాయంటున్నారు ఈ సినిమాలో నాగార్జున. ఏది ఏమైనా నాగ్‌ రూటే సెపరేటు. వయసు పెరిగినా కానీ హ్యాండ్‌సమ్‌లో యంగ్‌ హీరోలకి ధీటుగా కనిపిస్తూ ఉంటాడు. స్టార్‌ హీరో అయినప్పటికీ, యంగ్‌ హీరోలతో కలిసి నటిస్తూ స్టార్‌డమ్‌కి కొత్త నిర్వచనం చెబుతున్న హీరో నాగార్జున. త్వరలోనే 'రాజుగారి గది - 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఓంకార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత కీలక పాత్రలో నటిస్తోంది.

ALSO READ: అతను ముఖ్యమంత్రి అయితే సంతోషిస్తా: ఎస్ జే సూర్య