ENGLISH

సెట్స్‌ మీదికి వెళ్లనున్న కేసీఆర్‌ సినిమా

19 August 2017-16:17 PM

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయోపిక్‌ త్వరలోనే సెట్స్‌ మీదికి వెళ్లనుంది. ప్రముఖ నిర్మాత మధురా శ్రీధర్‌ ఈ సినిమాని రూపొందించనున్నారు. కేసీఆర్‌ రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుండీ తెలంగాణా ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను ఈ సినిమాలో చూపించనున్నారట. అలాగే తెలంగాణా సాధించడం, తెలంగాణా ముఖ్యమంత్రిగా ఎదగడం వరకూ అన్ని కీలక అంశాల్నీ ఈ సినిమాలో చూపించనున్నారట. కేసీఆర్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ నటించనున్నాడట. తెలంగాణా ఉద్యమం దేశ చరిత్రలోనే ఓ కీలక పరిణామం. అంతటి మహోద్యమానికి సంబంధించి సినిమా రావడం అంటే అది తెలంగాణా ప్రజలకు అరుదైన గుర్తింపుగా భావించాల్సి ఉంటుంది. ఇంతటి అద్భుతమైన ఘట్టానికి శ్రీకారం చుడుతున్న మధురా శ్రీధర్‌ని అభినందించకుండా ఉండలేము. ప్రస్తుతం తెలుగు సినిమాలో తెలంగాణా పోకడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య వచ్చిన చాలా చిత్రాల్లో తెలంగాణా మాండలికాలు, భాషా, యాస తదితర అంశాలపై ఫోకస్‌ ఎక్కువగా కనిపిస్తోంది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన 'పెళ్లిచూపులు' సినిమా, ఇటీవల విడుదలైన వరుణ్‌ తేజ్‌ 'ఫిదా'లోనూ తెలంగాణా పోకడ ఎక్కువగా కనిపించింది. 'ఫిదా' అయితే తెలంగాణా అమ్మాయి చుట్టూనే కథ నడుస్తుంది. ఇక తెలంగాణా ఏర్పడిన తర్వాత తొలి నాయకుడైన కేసీఆర్‌ జీవిత చరిత్ర అంటే ఈ ఘట్టాన్ని ఎంత అద్భుతంగా తెరపై మలచనున్నారో అంటూ తెలంగాణా ప్రజలు ఆశక్తితో ఎదురు చూస్తున్నారు.

 

ALSO READ: సెన్సార్ చీఫ్ వేటుకి వెనుక ఏక్తా?